చక్కెర ధరలకు రెక్కలు

న్యూఢిల్లీ, ఆగస్టు 28 (ప్రజా వీక్షణం ప్రతినిధి): విపరీతంగా పెరుగుతున్న చక్కెర ధరలు రానున్న పండుగ సీజన్‌లో ప్రజలకు తీపిని దూరం చేసే పరిస్థితి కనిపిస్తోంది. పండుగలు సమీపిస్తుండటంతో స్వీట్లు, ఇతర సంప్రదాయ వంటకాల తయారీ కోసం ప్రజలు చక్కెరను ముందుగానే కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటున్నారు. దీంతో చక్కెరకు డిమాండ్‌ పెరుగుతోంది. మరోవైపు పెరుగుతున్న ధరలు వినియోగదారులకు భారంగా మారుతున్నాయి.
చక్కెర కొనుగోళ్లపై వేగవంతమైన సరఫరా వేదికలు, దుకాణాలు పరిమితులు విధిస్తున్నట్లు తెలుస్తోంది. కొనుగోలు చేసే చక్కెర పరిమాణంపై సంస్థలను బట్టి నిబంధనలు మారుతున్నాయి. పెరుగుతున్న డిమాండ్‌, ధరల కారణంగా వినియోగదారులు, చిల్లర వ్యాపారులపై ఒత్తిడి పెరుగుతుండటంతో ఈ పరిమితులు విధించినట్లు సమాచారం.
పెద్ద చిల్లర దుకాణాల్లోనూ కొనుగోళ్లపై ఆంక్షలు అమల్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. కొన్ని దుకాణాల్లో ఒక్కో వినియోగదారుడు సుమారు రెండు నుంచి మూడు కిలోల వరకు మాత్రమే చక్కెర కొనుగోలు చేసేలా పరిమితులు విధించినట్లు సమాచారం. దీంతో పండుగల వేళ చక్కెర లభ్యతపై వినియోగదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
ప్రభుత్వ చర్యలు
చక్కెర ధరల పెరుగుదల నేపథ్యంలో సరఫరాను మెరుగుపరచడంతో పాటు నిల్వలను అక్రమంగా దాచిపెట్టడాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దిగుమతి చేసుకున్న ముడి చక్కెరను శుద్ధి చేసిన చక్కెరగా మార్చి దేశీయ మార్కెట్లో విక్రయించేందుకు దిగుమతిదారులకు మరింత సమయం కల్పించింది.
ఈ నెల 20న జారీ చేసిన ప్రకటన ప్రకారం.. ఈ ఏడాది అక్టోబరు 31 వరకు ప్రత్యేక కోటా కింద 10 లక్షల టన్నుల ముడి చక్కెరను సుంకం లేకుండా దిగుమతి చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. దేశీయ మార్కెట్లో చక్కెర లభ్యతను పెంచి ధరలపై ఒత్తిడిని తగ్గించడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
కుంభకోణమంటున్న విపక్షాలు
పండుగ సీజన్‌లో చక్కెర ధరలు పెరగడం వల్ల నిల్వదారులు, అక్రమంగా అధిక ధరలకు విక్రయించే వారికి ప్రయోజనం చేకూరేలా రూ.36 వేల కోట్ల విలువైన చక్కెర కుంభకోణానికి కేంద్ర ప్రభుత్వం సహకరించిందని విపక్షాలు ఆరోపించాయి.
చక్కెర కొరత గురించి ఏప్రిల్‌లోనే ప్రభుత్వానికి సమాచారం ఉన్నప్పటికీ తగిన చర్యలు తీసుకోలేదని విపక్షాలు విమర్శించాయి. దీంతో చక్కెర ధర కిలోకు రూ.40 నుంచి రూ.75 వరకు పెరిగిందని ఆరోపించాయి.
ఆగస్టు నుంచి నవంబరు మధ్య దేశంలో సుమారు 1.20 కోట్ల టన్నుల చక్కెర వినియోగం ఉండవచ్చని అంచనా వేస్తున్న నేపథ్యంలో.. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు కిలో చక్కెరకు కనీసం మరో రూ.30 అదనంగా చెల్లించాల్సి రావచ్చని విపక్షాలు పేర్కొన్నాయి.

error: Content is protected !!
Prajaveek Shanam