
ముంబై, ఆగస్టు 28 (ప్రజా వీక్షణం ప్రతినిధి): టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఉద్యోగులకు ఈసారి త్రైమాసిక ప్రోత్సాహక వేతనం తగ్గినట్లు సమాచారం. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో మధ్యస్థాయి, సీనియర్ స్థాయి ఉద్యోగులకు సగటున 60-70 శాతం మాత్రమే ప్రోత్సాహక వేతనం చెల్లించినట్లు మనీకంట్రోల్ నివేదిక పేర్కొంది. గత రెండు త్రైమాసికాల్లో ఇదే ఉద్యోగులకు 80 శాతం వరకు చెల్లించిన నేపథ్యంలో తాజా చెల్లింపులు తగ్గినట్లు తెలుస్తోంది.
గతంలో దాదాపు రెండేళ్ల పాటు మధ్యస్థాయి, సీనియర్ ఉద్యోగులకు కేవలం 20-40 శాతం వరకు మాత్రమే త్రైమాసిక ప్రోత్సాహక వేతనం లభించింది. ఇటీవల పరిస్థితులు మెరుగుపడి 80 శాతం వరకు చెల్లింపులు జరగగా, తాజాగా మళ్లీ తగ్గడం ఉద్యోగుల్లో చర్చనీయాంశంగా మారింది.
మార్జిన్లపై ఒత్తిడి
టీసీఎస్ తాజా త్రైమాసికంలో 24 శాతం నిర్వహణ లాభ మార్జిన్‌ను నమోదు చేసింది. అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే ఇది 130 ఆధార బిందువులు తగ్గింది. కృత్రిమ మేధ, కొత్త సాంకేతికతలపై కంపెనీ పెట్టుబడులు పెంచడం, ఉద్యోగుల వేతనాల పెంపు వంటి అంశాలు మార్జిన్లపై ప్రభావం చూపినట్లు నివేదిక పేర్కొంది.
కంపెనీ ఆర్థిక విభాగం అధిపతి సమీర్ సెక్సారియా మాట్లాడుతూ.. కేవలం లాభ మార్జిన్లను పెంచడంపైనే దృష్టి పెట్టకుండా, భవిష్యత్తులో వృద్ధికి అవసరమైన సామర్థ్యాలపై పెట్టుబడులు కొనసాగిస్తామని తెలిపారు.
ఇన్ఫోసిస్లోనూ తగ్గుదల
మరోవైపు ఇన్ఫోసిస్లోనూ ఉద్యోగుల త్రైమాసిక ప్రోత్సాహక వేతనం తగ్గినట్లు సమాచారం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో సగటున 70 శాతం చెల్లించగా, గతేడాది ఇదే కాలంలో 80 శాతం చెల్లించినట్లు తెలుస్తోంది.
హాజరుపై ఆధారపడి చెల్లింపు
టీసీఎస్‌లో ఉద్యోగుల కార్యాలయ హాజరుకు కూడా త్రైమాసిక ప్రోత్సాహక వేతనంతో సంబంధం ఉంది. ప్రస్తుత విధానం ప్రకారం 85 శాతం లేదా అంతకంటే ఎక్కువ హాజరు ఉంటే పూర్తి ప్రోత్సాహక వేతనం పొందే అర్హత ఉంటుంది.
75-85 శాతం హాజరు ఉంటే గరిష్ఠంగా 75 శాతం, 60-75 శాతం హాజరు ఉంటే గరిష్ఠంగా 50 శాతం వరకు మాత్రమే ప్రోత్సాహక వేతనం లభిస్తుంది. 60 శాతం కంటే తక్కువ హాజరు ఉంటే త్రైమాసిక ప్రోత్సాహక వేతనం అందదు.












