పోలీస్ కస్టడీలో దళిత యువకుడి మృతి

బదాయూన్, ఆగస్టు 29 (ప్రజా వీక్షణం ప్రతినిధి): ఉత్తరప్రదేశ్‌లోని బదాయూన్ జిల్లాలో 28 ఏళ్ల దళిత యువకుడు రాజేశ్ పోలీస్ కస్టడీలో మృతిచెందిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భండారా కార్యక్రమంలో జరిగిన గొడవకు సంబంధించి పోలీసులు రాజేశ్‌ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం స్టేషన్ ప్రాంగణంలోనే అతడు ఒక్కసారిగా కుప్పకూలడంతో విషాదం చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వీడియోలో రాజేశ్ ఒక్కసారిగా నేలపై పడిపోవడం, వెంటనే ఇద్దరు పోలీసులు అతడిని లేపేందుకు, ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించడం కనిపించింది. పరిస్థితి విషమించడంతో అతడిని వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు.
అయితే ఆస్పత్రికి చేరుకునేలోపే రాజేశ్ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు, స్థానికులు ఆస్పత్రి వద్దకు చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు. యువకుడి మృతిపై పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలని వారు డిమాండ్ చేశారు. రాజేశ్‌ను పోలీసులు కస్టడీలో కొట్టారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోలీసుల దాడుల కారణంగానే అతడు ప్రాణాలు కోల్పోయాడని వారు అనుమానం వ్యక్తం చేశారు. ఘటనపై నిష్పక్షపాత విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.మరోవైపు పోలీసులు ఈ ఆరోపణలను ఖండించారు. పోస్టుమార్టం నివేదిక ప్రకారం రాజేశ్ కార్డియోజెనిక్ షాక్ కారణంగా మృతిచెందినట్లు వెల్లడైందని తెలిపారు. అతడి శరీరంపై ఎలాంటి బాహ్య గాయాలు లేదా దాడి ఆనవాళ్లు లేవని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనపై స్థానిక పరిపాలన, పోలీసు శాఖ దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. సీసీటీవీ దృశ్యాలు, వైద్య నివేదికలు, ఇతర ఆధారాలను పరిశీలించి పూర్తి వాస్తవాలను వెలికితీసే ప్రయత్నం జరుగుతోందని అధికారులు తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.

error: Content is protected !!
Prajaveek Shanam