
న్యూఢిల్లీ, ఆగస్టు 30 (ప్రజా వీక్షణం ప్రతినిధి): అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో అరుదైన పరిణామం చోటుచేసుకుంది. సాధారణంగా ముడి చమురు కోసం రష్యాపై ఆధారపడే భారత్, ఇప్పుడు అదే రష్యాకు పెట్రోల్ ఎగుమతి చేసే కీలక దేశంగా అవతరించింది. ఉక్రెయిన్ డ్రోన్ దాడులతో రష్యాలోని పలు చమురు శుద్ధి కర్మాగారాలు తీవ్రంగా దెబ్బతినడంతో అక్కడ ఇంధన ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. ఈ పరిస్థితుల్లో దేశీయ అవసరాలను తీర్చుకోవడానికి రష్యా విదేశాల నుంచి పెట్రోల్ దిగుమతులపై ఆధారపడాల్సి వచ్చింది. ఈ పరిణామం ప్రపంచ ఇంధన రంగంలో భారత్ ప్రాధాన్యాన్ని మరింత పెంచినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.వోర్టెక్సా అనే అంతర్జాతీయ ఎనర్జీ అనలిటిక్స్ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం గత రెండు నెలల్లో రష్యా రిఫైనరీలపై సుమారు 32 డ్రోన్ దాడులు జరిగాయి. ఈ దాడుల ప్రభావంతో దేశీయ పెట్రోల్ ఉత్పత్తి దాదాపు 70 శాతం మేర తగ్గిపోయినట్లు అంచనా వేస్తున్నారు. ఫలితంగా రష్యాలోని అనేక నగరాల్లో పెట్రోల్ బంకుల వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరాయి. ఇంధన కొరత తీవ్రరూపం దాల్చడంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు రష్యా ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ఎగుమతులపై ఆంక్షలు విధించింది. ఈ సంక్షోభ సమయంలో భారత్ రష్యాకు అండగా నిలిచింది. జులై, ఆగస్టు నెలల్లో భారత్ నుంచి దాదాపు 10 లక్షల బ్యారెళ్ల పెట్రోల్ రష్యాకు ఎగుమతి అయినట్లు వాణిజ్య వర్గాలు వెల్లడించాయి. భారత్తో పాటు తుర్కియే, మొరాకో దేశాలు కూడా రష్యాకు ఇంధనాన్ని సరఫరా చేస్తున్నాయి. గుజరాత్లోని వడినార్లో ఉన్న నయారా ఎనర్జీ రిఫైనరీ నుంచే ఈ ఎగుమతుల్లో అధిక భాగం జరిగినట్లు సమాచారం. ఈ రిఫైనరీలో రష్యా ప్రభుత్వ రంగ సంస్థ రాస్నెఫ్ట్కు వాటా ఉండటం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.
మరోవైపు ప్రపంచంలో మూడో అతిపెద్ద రిఫైనింగ్ దేశంగా భారత్ తన సామర్థ్యాన్ని వేగంగా పెంచుకుంటోంది. ప్రస్తుతం 272 మిలియన్ మెట్రిక్ టన్నుల వార్షిక సామర్థ్యాన్ని 300 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెంచే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి. దీంతో ఆసియా ప్రాంతంలోనే కాకుండా ప్రపంచ ఇంధన మార్కెట్లో కూడా భారత్ కీలక రిఫైనింగ్ కేంద్రంగా ఎదుగుతోందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ఇటీవల పేర్కొన్నారు.ఇరాన్ యుద్ధ పరిస్థితులు, హర్మూజ్ జలసంధి మూసివేత వంటి అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో భారత్ తన ముడి చమురు దిగుమతుల వనరులను కూడా విస్తరించింది. ఒకప్పుడు 27 దేశాల నుంచి మాత్రమే చమురు కొనుగోలు చేసిన భారత్ ప్రస్తుతం 41 దేశాల నుంచి దిగుమతులు చేస్తోంది. ప్రపంచ మార్కెట్లో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నప్పటికీ దేశ ఇంధన భద్రతకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అయితే ముడి చమురు సరఫరాలో రష్యా ప్రాధాన్యం ఇంకా కొనసాగుతోంది. కెప్లర్ డేటా ప్రకారం ఆగస్టులో రష్యా నుంచి భారత్కు వచ్చిన ముడి చమురు దిగుమతులు స్వల్పంగా తగ్గి రోజుకు 2.1 మిలియన్ బ్యారెళ్ల స్థాయికి చేరుకున్నప్పటికీ, మొత్తం దిగుమతుల్లో దాదాపు 40 శాతం వాటాతో రష్యానే అతిపెద్ద సరఫరాదారుగా నిలిచింది. ఒకవైపు రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుంటూనే, మరోవైపు అదే దేశానికి పెట్రోల్ ఎగుమతి చేయడం ద్వారా భారత్ అంతర్జాతీయ ఇంధన రంగంలో తన వ్యూహాత్మక ప్రాధాన్యాన్ని మరింత బలోపేతం చేసుకుంటోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.












