
ఖమ్మం, ఆగస్టు 30 (ప్రజా వీక్షణంప్రతినిధి): మధిర నియోజకవర్గం చింతకాని మండలం నాగిలిగొండ గ్రామ అభివృద్ధికి రూ.6.10 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఆదివారం గ్రామంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. గ్రామ ప్రజలకు మెరుగైన రహదారులు, మౌలిక వసతులు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నాగిలిగొండ నుంచి తుతికుంట వరకు రూ.5.25 కోట్ల వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు ఉప ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ రహదారి పూర్తయితే రెండు గ్రామాల మధ్య రాకపోకలు మరింత సులభతరం అవుతాయని, రైతులు, విద్యార్థులు, ఉద్యోగులకు ప్రయాణ సౌకర్యం మెరుగుపడుతుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
అలాగే నాగిలిగొండ ఎస్సీ కాలనీలో రూ.85 లక్షల వ్యయంతో చేపట్టనున్న అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులను కూడా ప్రారంభించారు. కాలనీలో నివసించే ప్రజలు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఈ పనులు పూర్తయితే రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు వర్షాకాలంలో ఎదురయ్యే ఇబ్బందులు తగ్గుతాయని చెప్పారు. గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ వంటి మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.
నాగిలిగొండ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఉప ముఖ్యమంత్రి అన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా అవసరమైన అన్ని వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అభివృద్ధి పనులు నాణ్యతతో, నిర్దేశిత గడువులో పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు. అభివృద్ధి పనుల ప్రారంభంపై గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఉప ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.












