నాగ్‌ 100వ సినిమాలో ఐశ్వర్య రాజేష్‌?

హైదరాబాద్‌, ఆగస్టు 31 (ప్రజా వీక్షణం ప్రతినిధి): టాలీవుడ్‌ ‘కింగ్‌’ అక్కినేని నాగార్జున కెరీర్‌లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘కింగ్‌ 100’. నాగార్జున నటిస్తున్న 100వ సినిమా కావడంతో ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తమిళ దర్శకుడు రా. కార్తీక్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త ఫిల్మ్‌ నగర్‌ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ప్రముఖ నటి ఐశ్వర్య రాజేష్‌ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే చిత్రబృందం నుంచి దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.ఇటీవల నాగార్జున పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ‘కింగ్‌ 100’ టైటిల్‌ గ్లింప్స్‌ను ఐశ్వర్య రాజేష్‌ తన సామాజిక మాధ్యమ ఖాతాలో పంచుకున్నారు. దీంతో ఆమె ఈ సినిమాలో నటించడం దాదాపు ఖాయమనే చర్చ మొదలైంది. అయితే అధికారిక ప్రకటన వచ్చే వరకు దీనిని కేవలం ప్రచారంగానే చూడాల్సి ఉంటుంది.
ఐశ్వర్య రాజేష్‌ ఇప్పటికే తెలుగు, తమిళ భాషల్లో నటనకు ప్రాధాన్యమున్న విభిన్న పాత్రలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్‌ సరసన నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం సుమంత్‌ సరసన ‘మహేంద్రగిరి వరాహి’తో పాటు రవితేజ కొత్త చిత్రంలోనూ నటిస్తూ బిజీగా ఉన్నారు. నాగార్జున 100వ సినిమాలో అవకాశం లభిస్తే ఆమె కెరీర్‌లో ఇది మరో కీలక ప్రాజెక్ట్‌గా నిలిచే అవకాశం ఉంది.సాధారణ వాణిజ్య చిత్రాలకు భిన్నంగా కథ, పాత్రలకు ప్రాధాన్యతనిస్తూ ‘కింగ్‌ 100’ తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో టబు, సుష్మిత భట్‌ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని 2026 డిసెంబర్‌ 24న క్రిస్మస్‌ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. నాగార్జున 100వ సినిమాలో ఐశ్వర్య రాజేష్‌ పాత్ర ఎలా ఉండబోతుందన్నది అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

error: Content is protected !!
Prajaveek Shanam