ముంబై, ఆగస్టు 31 (ప్రజా వీక్షణం ప్రతినిధి): టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి టాటూలంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే పలు విభిన్న డిజైన్లను టాటూలుగా వేయించుకున్న కోహ్లీ.. తాజాగా మరో కొత్త టాటూతో అభిమానుల దృష్టిని ఆకర్షించాడు. అతడి ఎడమ చేతిపై కనిపిస్తున్న ఈ కొత్త డిజైన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
నీటిలో అలల తరహాలో డిజైన్.. కోహ్లీ కొత్త టాటూను పరిశీలిస్తే.. నీటి ఉపరితలంపై చుక్క పడినప్పుడు ఏర్పడే అలల మాదిరిగా ఈ డిజైన్ కనిపిస్తోంది. ఈ టాటూ కోసం కోహ్లీ ఇప్పటికే ఐదు సెషన్లు చేయించుకున్నట్లు సమాచారం. అయితే టాటూ పని ఇంకా కొనసాగుతున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.
జీవిత ప్రయాణానికి ప్రతిబింబంగా.. కోహ్లీ జీవిత ప్రయాణం, వ్యక్తిగత పరిణామం, గత అనుభవాలు, ప్రస్తుత వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా ఈ టాటూ ప్రాజెక్ట్ను రూపొందిస్తున్నట్లు ఏలియన్స్ టాటూ వెల్లడించినట్లు సమాచారం. అయితే కొత్త టాటూకు కోహ్లీ వ్యక్తిగతంగా ఎలాంటి అర్థం ఇచ్చాడనేది మాత్రం స్పష్టంగా తెలియలేదు.
12వ టాటూ కానుందా? ఈ తాజా టాటూ పూర్తయితే కోహ్లీ టాటూల సంఖ్య 12కు చేరనుంది. ఇప్పటికే అతడి చేతిపై శివుడి ప్రేరణతో కూడిన డిజైన్, మండల, లోటస్, పియోనీ వంటి పలు టాటూలు ఉన్నాయి. వీటిలో మండల డిజైన్ బ్యాలెన్స్, డిసిప్లిన్, అంతర్గత సమతుల్యతకు ప్రతీకగా టాటూ స్టూడియో పేర్కొంది.












