సుకన్య సమృద్ధి ఖాతా.. ఎన్నారైలకు అవకాశం లేదు

న్యూఢిల్లీ, ఆగస్టు 31 (ప్రజా వీక్షణం ప్రతినిధి): ఆడపిల్లల ఉన్నత చదువులు, వివాహం వంటి భవిష్యత్తు అవసరాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకమే సుకన్య సమృద్ధి యోజన. అయితే ఈ ఖాతాను ప్రతి ఒక్కరూ తెరవలేరు. బాలిక వయసు, నివాస హోదాకు సంబంధించి నిర్దిష్ట నిబంధనలు ఉన్నాయి.
ఎన్నారైలకు అవకాశం లేదు
భారత్‌లో నివసించే పౌరులకే సుకన్య సమృద్ధి ఖాతాలో పెట్టుబడి పెట్టేందుకు అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రవాస భారతీయులు ఈ ఖాతాను తెరవడానికి అర్హులు కారు. ఖాతా తెరిచే సమయంలో బాలిక భారత్‌లో నివసిస్తూ ఉండటం తప్పనిసరి.
ఎవరు ఖాతా తెరవొచ్చు?
బాలిక తరఫున తల్లి, తండ్రి లేదా చట్టబద్ధ సంరక్షకులు ఖాతాను తెరవవచ్చు. ఖాతా ప్రారంభించే సమయంలో బాలిక వయసు 10 ఏళ్లలోపు ఉండాలి. ఒక కుటుంబంలో సాధారణంగా గరిష్ఠంగా ఇద్దరు ఆడపిల్లలకు ఈ పథకం వర్తిస్తుంది.
ఏటా రూ.1.50 లక్షల వరకు
ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.250, గరిష్ఠంగా రూ.1.50 లక్షలు జమ చేయవచ్చు. ఖాతాలో 15 ఏళ్లపాటు డిపాజిట్లు చేయవచ్చు. బాలికకు 18 ఏళ్లు నిండిన తర్వాత ఉన్నత విద్య కోసం నిబంధనల మేరకు పాక్షికంగా నగదు తీసుకునే అవకాశం ఉంటుంది. 21 ఏళ్లు పూర్తయిన తర్వాత ఖాతా మెచ్యూర్ అవుతుంది.
పన్ను ప్రయోజనాలు
పాత పన్ను విధానాన్ని ఎంచుకున్న వారికి సెక్షన్‌ 80సీ కింద అర్హత మేరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. పెట్టుబడి, వడ్డీ, మెచ్యూరిటీ మొత్తాలకు సంబంధించిన పన్ను ప్రయోజనాలు కూడా ఈ పథకంలో ఉన్నాయి.
పెట్టుబడి మానేస్తే..
ఏదైనా కారణంతో వార్షిక పెట్టుబడి చేయకపోతే ఖాతా నిష్క్రియంగా మారవచ్చు. అయితే నిర్ణీత కాలంలో బకాయి మొత్తాలతో పాటు జరిమానా చెల్లించి ఖాతాను తిరిగి క్రియాశీలం చేసుకునే అవకాశం ఉంటుంది.

error: Content is protected !!
Prajaveek Shanam