ఆలంపూర్ అభివృద్ధికి కేంద్రం ప్రాధాన్యత

ఆలంపూర్, ఆగస్టు 31 (ప్రజా వీక్షణం ప్రతినిధి): జోగులాంబ అమ్మవారి శక్తిపీఠం అభివృద్ధితో పాటు ఆలంపూర్ ప్రాంత సమగ్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖల మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. అమృత్ భారత్ పథకం కింద రూ.6.07 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేస్తున్న జోగులాంబ రైల్వే స్టేషన్‌ను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాల్లో ఏర్పాటు చేసిన సమాచార బోర్డులను తిలకించి, ‘ఒక స్టేషన్ – ఒక ఉత్పత్తి’ స్టాల్‌ను సందర్శించారు. అనంతరం టికెట్ కౌంటర్ వద్ద ప్రయాణికులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.
విలేకరులతో మాట్లాడిన కిషన్ రెడ్డి, జోగులాంబ ఆలయ అభివృద్ధి కోసం కేంద్ర పర్యాటక శాఖ ఇప్పటికే రూ.37 కోట్ల నిధులు మంజూరు చేసిందని తెలిపారు. ఆలయాల సంరక్షణ, అంతర్గత అభివృద్ధి పనులను కేంద్ర సాంస్కృతిక శాఖ, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆధ్యాత్మిక, చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఆలంపూర్‌ను దేశవ్యాప్తంగా ప్రముఖ పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు. ఆలంపూర్ అభివృద్ధికి కేంద్రం నిధులు విడుదల చేసినప్పటికీ బస్ స్టాండ్, వంతెనలు, రహదారులు వంటి కొన్ని కీలక మౌలిక వసతుల పనులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. సంబంధిత అధికారులు రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని ఆ పనులను వేగవంతం చేయాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న అన్ని అభివృద్ధి కార్యక్రమాలను సమగ్రంగా సమీక్షించి, జాప్యం లేకుండా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగాన్ని కోరారు.
దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి కూడా జోగులాంబ అమ్మవారి దర్శనానికి భక్తులు వస్తున్న నేపథ్యంలో మరిన్ని సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని కిషన్ రెడ్డి అన్నారు. భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని రహదారులు, పార్కింగ్ సదుపాయాలు, తాగునీటి వసతి, పారిశుధ్యం, ప్రజారవాణా వంటి మౌలిక వసతులను మరింత మెరుగుపరచాలని సూచించారు. ఆలంపూర్‌ను ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి చేయడంపై కేంద్రం దృష్టి సారించిందన్నారు. తెలంగాణలో రైల్వే మౌలిక వసతుల విస్తరణకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతోందని మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 42 రైల్వే స్టేషన్లను ఆధునికీకరిస్తున్నామని, 2027 నాటికి ఈ పనులను పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు. జోగులాంబ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు ఇప్పటికే 95 శాతం పూర్తయ్యాయని, మిగిలిన పనులను కూడా త్వరలో పూర్తి చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
జోగులాంబ అమ్మవారి శక్తిపీఠం ఆధ్యాత్మిక వైభవం ప్రతిబింబించేలా రైల్వే స్టేషన్‌ను ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నామని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ స్టేషన్ అందుబాటులోకి వస్తే భక్తులతో పాటు ఆలంపూర్ పరిసర ప్రాంతాల ప్రజలకు హైదరాబాద్, కర్నూలు తదితర ప్రాంతాలకు రాకపోకలు మరింత సులభతరం అవుతాయని చెప్పారు. తెలంగాణలో రైల్వే నెట్‌వర్క్ విస్తరణలో భాగంగా సింగిల్ లైన్లను డబుల్ లైన్లుగా, డబుల్ లైన్లను ట్రిపుల్ లైన్లుగా, అవసరమైన చోట నాలుగు లైన్లుగా అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ, ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ డివిజన్ డీఆర్‌ఎం సంతోష్ కుమార్ వర్మ, జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఎస్పీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Prajaveek Shanam