ఈటె పట్టిన నేషనల్ క్రష్.. రష్మిక ‘మైసా’ రిలీజ్ డేట్ ఫిక్స్!

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 01 (ప్రజా వీక్షణం ప్రతినిధి): నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘మైసా’ విడుదల తేదీ ఖరారైంది. 2026 నవంబర్‌ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో చేతిలో ఈటె పట్టుకుని రష్మిక పవర్‌ఫుల్ లుక్‌లో కనిపించడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
గిరిజన మహిళగా రష్మిక.. పూర్తిగా కొత్త అవతార్‌లో!
‘మైసా’లో రష్మిక గోండ్ గిరిజన మహిళ, తిరుగుబాటుదారిణి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఇప్పటివరకు గ్లామర్, లవ్, ఫ్యామిలీ, కామెడీ పాత్రల్లో మెప్పించిన ఆమె.. ఈ సినిమాలో యాక్షన్ షేడ్స్‌తో కూడిన భిన్నమైన పాత్రను పోషిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈటెతో పోరాటం.. గిరిజన నేపథ్యంపై ఆసక్తికర కథ!
గిరిజన ప్రాంతాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అక్కడి ప్రజల జీవన విధానం, నమ్మకాలు, సమస్యలు, పోరాటాలను చూపించనున్నట్లు సమాచారం. రష్మిక పాత్ర చుట్టూనే కథనం సాగనుండగా.. భారీ యాక్షన్ సన్నివేశాలు, గిరిజన నేపథ్యాన్ని ప్రతిబింబించే విజువల్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
అక్టోబర్‌లో ‘రణబలి’.. నవంబర్‌లో ‘మైసా’!
రవీంద్ర పుల్లె దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని అన్‌ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్‌పై అనిల్, అజయ్ సయ్యపురెడ్డి, శ్రీకాంత్ సాతి నిర్మిస్తున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తుండగా, తారక్ పొన్నప్ప కీలక పాత్రలో నటిస్తున్నారు. మరోవైపు విజయ్ దేవరకొండతో రష్మిక నటిస్తున్న ‘రణబలి’ అక్టోబర్‌ 16న విడుదల కానుంది. కేవలం 42 రోజుల వ్యవధిలోనే ‘మైసా’ నవంబర్‌ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.

error: Content is protected !!
Prajaveek Shanam