న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1 (ప్రజా వీక్షణం ప్రతినిధి): భారత్-జర్మనీ మధ్య పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పుల నియంత్రణ రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించే లక్ష్యంతో 4వ ఇండో-జర్మన్ పర్యావరణ వేదిక సమావేశం న్యూఢిల్లీలో జరిగింది. కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్, జర్మనీ పర్యావరణ మంత్రి కార్స్టెన్ ష్నైడర్ సంయుక్తంగా ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. పర్యావరణ పరిరక్షణలో జ్ఞానాన్ని పంచుకోవడం, సమర్థవంతమైన పరిష్కారాలను విస్తరించడం, సంస్థాగత సామర్థ్యాలను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని భూపేందర్ యాదవ్ ఈ సందర్భంగా నొక్కిచెప్పారు. జర్మనీ పర్యావరణ మంత్రి కార్స్టెన్ ష్నైడర్ మాట్లాడుతూ పునరుత్పాదక ఇంధన రంగంలో భారత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోందని ప్రశంసించారు. స్వచ్ఛ ఇంధన ఉత్పత్తి, హరిత సాంకేతికతల వినియోగంలో భారత్ సాధిస్తున్న పురోగతి విశేషమని పేర్కొన్నారు. పర్యావరణ, వాతావరణ మార్పుల సవాళ్లను ఎదుర్కోవడంలో భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా బలోపేతం చేసేందుకు జర్మనీ ఆసక్తిగా ఉందన్నారు.
సమావేశంలో భాగంగా అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేలల (వెట్‌ల్యాండ్స్) సంరక్షణ, సమర్థ వినియోగానికి సంబంధించి భారత్, జర్మనీ మధ్య సంయుక్త ఉద్దేశ్య ప్రకటన పై సంతకాలు జరిగాయి. జీవవైవిధ్య పరిరక్షణ, పర్యావరణ సమతుల్యత కాపాడడంలో చిత్తడి నేలల ప్రాధాన్యతను ఇరు దేశాలు గుర్తించాయి. ‘టుగెదర్ ఫర్ మోర్ రెసిలియెన్స్’ అనే అంశంతో నిర్వహించిన ఈ వేదికలో తక్కువ కార్బన్ పరిశ్రమలు, చిత్తడి నేలలు, అటవీ ప్రాంతాల జీవవైవిధ్యం, వనరుల సమర్థ వినియోగం, వృత్తాకార ఆర్థిక వ్యవస్థ, సుస్థిర ఆర్థిక వనరులు, హరిత నైపుణ్యాల అభివృద్ధి వంటి అంశాలపై చర్చించారు.
ఈ సమావేశం ద్వారా ఇరు దేశాల విధాన నిర్ణేతలు, పరిశ్రమల ప్రతినిధులు, పరిశోధనా సంస్థలు, నిపుణుల మధ్య పరస్పర సహకారం మరింత బలోపేతం కానుందని భావిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు హరిత ఆర్థిక వ్యవస్థ నిర్మాణంలో భారత్-జర్మనీ భాగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తుందని సమావేశంలో అభిప్రాయపడ్డారు. భారత్, జర్మనీ మధ్య పెరుగుతున్న ఆర్థిక, పారిశ్రామిక సంబంధాల నేపథ్యంలో ఈ పర్యావరణ వేదికకు ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. సుస్థిర అభివృద్ధి, హరిత సాంకేతికతలు, వాతావరణ మార్పుల నియంత్రణ వంటి రంగాల్లో భవిష్యత్తులో మరిన్ని ఉమ్మడి కార్యక్రమాలు చేపట్టేందుకు ఈ సమావేశం మార్గం సుగమం చేస్తుందని అధికారులు తెలిపారు.












