న్యూఢిల్లీ సెప్టెంబర్ 01 (ప్రజా వీక్షణం ప్రతినిధి):స్మార్ట్ఫోన్, గృహోపకరణాలు లేదా ఇతర వ్యక్తిగత అవసరాల కోసం రుణాలు తీసుకుని నెలవారీ వాయిదాలు చెల్లించడం ప్రస్తుతం సాధారణంగా మారింది. అయితే ఉద్యోగం కోల్పోవడం, అనారోగ్యం లేదా ఇతర ఆర్థిక ఇబ్బందుల కారణంగా వాయిదాలు ఆలస్యమైతే కొందరు వసూలు ఏజెంట్లు రుణగ్రహీతలను బెదిరించడం, పదేపదే ఫోన్ చేయడం వంటి చర్యలకు పాల్పడుతున్న ఘటనలు కనిపిస్తున్నాయి. ఇలాంటి వేధింపులకు అడ్డుకట్ట వేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కఠిన నిబంధనలను అమల్లోకి తీసుకురానుంది. ఈ నిబంధనలు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
ఫోన్ను దూరం నుంచి లాక్ చేయలేరు
కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత రుణం చెల్లించలేదనే కారణంతో బ్యాంకులు లేదా రుణ సంస్థలు రుణగ్రహీత స్మార్ట్ఫోన్ను దూరం నుంచి లాక్ చేయడం లేదా వినియోగాన్ని నిలిపివేయడం వంటి చర్యలకు పాల్పడకూడదు. అలాగే మొబైల్లోని వ్యక్తిగత ఫొటోలు, సందేశాలు, స్థాన వివరాలు, ఫోన్లోని పరిచయాల జాబితాను రుణ వసూలు కోసం ఉపయోగించకూడదు.
కుటుంబ సభ్యులను వేధించకూడదు
రుణం చెల్లించలేదనే కారణంతో రుణగ్రహీత కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా కార్యాలయ సహోద్యోగులకు ఫోన్ చేసి ఒత్తిడి చేయడం, పరువు తీసేలా వ్యవహరించడం వంటివి చేయకూడదు. రుణ వసూలు ఏజెంట్లు దుర్భాషలు ఉపయోగించడం, బెదిరించడం లేదా అసభ్యంగా ప్రవర్తించడం కూడా నిషేధం.
పదేపదే ఫోన్ చేసి వేధింపులకు చెక్
బ్యాంకులు, రుణ సంస్థలు రోజంతా పదేపదే ఫోన్ చేసి రుణగ్రహీతలను వేధించకూడదు. రుణ వసూలుకు సంబంధించిన సంభాషణలను తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది. ఫోన్, ల్యాప్టాప్ వంటి వస్తువులను వాయిదాల పద్ధతిలో కొనుగోలు చేసినా, చెల్లింపులు ఆలస్యమైనప్పుడు ముందస్తు నోటీసు లేకుండా ఏకపక్షంగా చర్యలు తీసుకోకూడదు.
ఈ నిబంధనల ప్రధాన ఉద్దేశం రుణగ్రహీతలపై ఒత్తిడి, బెదిరింపులు, వ్యక్తిగత సమాచార దుర్వినియోగాన్ని అరికట్టి.. రుణ వసూలు ప్రక్రియను మరింత పారదర్శకంగా, బాధ్యతాయుతంగా మార్చడం.












