24 గంటల్లో హత్య కేసు ఛేదన.. ఎనిమిది మంది అరెస్ట్

నెల్లూరు: ప్రజా వీక్షణం సెప్టెంబర్ 01

వేదాయపాలెం పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసును పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఛేదించి ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేశారు. శాస్త్రీయ దర్యాప్తు, సీసీటీవీ ఫుటేజీ, సైబర్‌ విశ్లేషణ, సాంకేతిక ఆధారాలు, క్షేత్రస్థాయి విచారణతో పోలీసులు కేసును వేగంగా ఛేదించారు.పోలీసుల వివరాల మేరకు.. చంద్రమౌళినగర్‌కు చెందిన లక్ష్మిశెట్టి సాయి తేజ అలియాస్ కమ్మ సాయి (23)కు కొంతమంది స్నేహితులతో గతంలో విభేదాలు, గొడవలు ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. మద్యం సేవించే సమయంలో జరిగిన గొడవలు, పాత కక్షలు, వ్యక్తిగత విభేదాల నేపథ్యంలో నిందితులు సాయి తేజపై దాడి చేసి, తలపై బండరాయితో మోది హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.మృతుడి భార్య సంధ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు వేదాయపాలెం పోలీస్‌స్టేషన్‌లో క్రైం నంబర్ 226/2026 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జిల్లా ఎస్పీ డాక్టర్ ఆజిత వేజెండ్ల ఐపీఎస్ ఆదేశాల మేరకు నెల్లూరు టౌన్ డీఎస్పీ ఎం. గిరిధర్, నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
సీసీఎస్ సీఐ సీతారామయ్య (వేదాయపాలెం ఇన్‌చార్జి సీఐ) ఆధ్వర్యంలో టౌన్ పోలీసులు, సీసీఎస్, సైబర్ విభాగాల బృందాలు సమన్వయంతో దర్యాప్తు నిర్వహించి నిందితులను గుర్తించారు. ఈ కేసులో కల్లూరు హనూక్, ప్రేమ్‌కుమార్, కాసారం వంశీకృష్ణ అలియాస్ నిప్పో వంశీ, గోడ సాయికుమార్, రాహుల్, ప్రదీప్, హరి, జగదీష్‌లను అరెస్ట్ చేశారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.కేసును 24 గంటల్లో ఛేదించి నిందితులను అరెస్ట్ చేయడంలో సమర్థవంతంగా పనిచేసిన పోలీసు దర్యాప్తు బృందాలను జిల్లా ఎస్పీ అభినందించారు. నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించబోమని పోలీసు శాఖ స్పష్టం చేసింది.

error: Content is protected !!
Prajaveek Shanam