ఐవెర్సన్‌ లుక్‌లో నవోమి ఒసాకా

న్యూయార్క్‌, సెప్టెంబర్‌ 01 (ప్రజా వీక్షణం ప్రతినిధి):టెన్నిస్‌ స్టార్‌ నవోమి ఒసాకా ఆటతోనే కాకుండా తన విభిన్న ఫ్యాషన్‌ శైలితోనూ అభిమానులను ఆకట్టుకుంటోంది. యూఎస్‌ ఓపెన్‌ 2026 మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌ మ్యాచ్‌కు ఆమె బాస్కెట్‌బాల్‌ దిగ్గజం అలెన్‌ ఐవెర్సన్‌ స్ఫూర్తితో ప్రత్యేకమైన లుక్‌లో కోర్టులోకి అడుగుపెట్టి అందరి దృష్టిని ఆకర్షించింది.
కోర్టులోకి వచ్చిన సమయంలో పొడవాటి తెల్లని స్కర్ట్‌, వదులుగా ఉన్న హుడీ ధరించిన ఒసాకా.. ఆ తర్వాత ఆ దుస్తులను తొలగించి ఐవెర్సన్‌ శైలిని గుర్తుచేసే ప్రత్యేకమైన రూపంలో కనిపించింది. తన జుట్టును కూడా ఐవెర్సన్‌ తరహాలో తీర్చిదిద్దుకోవడం విశేషం. అంతకుముందు ఐవెర్సన్‌ ఫొటో ఉన్న టీషర్ట్‌ను ధరించి తన అభిమానాన్ని చాటుకుంది.
తన ప్రత్యేకమైన లుక్‌ గురించి ఒసాకా మాట్లాడుతూ, ఐవెర్సన్‌ అంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపింది. ఆటతో పాటు ఫ్యాషన్‌లోనూ ఆయన ప్రత్యేకత చూపించారని, క్రీడాకారులు తమ వ్యక్తిత్వాన్ని దుస్తుల ద్వారా కూడా వ్యక్తపరచుకోవచ్చని పేర్కొంది.
ఒసాకా ఫ్యాషన్‌ లుక్‌ను చూసిన ఐవెర్సన్‌ కూడా స్పందించాడు. తనకు ఇచ్చిన ఈ గౌరవం ఎంతో గొప్పదని, ఒసాకా తనకు పెద్ద అభిమానిగా ఉండటం సంతోషంగా ఉందని అభినందించాడు.
ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలి రౌండ్‌లో జఖరోవాపై విజయం సాధించిన ఒసాకా రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది. గతంలోనూ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో విభిన్నమైన దుస్తులతో అభిమానులను ఆకట్టుకున్న ఆమె.. మరోసారి తన ప్రత్యేకమైన ఫ్యాషన్‌తో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

error: Content is protected !!
Prajaveek Shanam