
ఉత్సాహంగా బైక్ ర్యాలీ.. ఘనంగా జనసేన యువజన విభాగం ఆవిష్కరణ
గూడూరు: జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు గూడూరు నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, లీగల్ సెల్ తీగల చంద్రశేఖర్‌రావు, నియోజకవర్గ నాయకులు కె. మోహన్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ, జనసేన యువజన విభాగం ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు.
గూడూరు జనసేన పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీ దర్గా, గాంధీ విగ్రహం, టవర్ క్లాక్ సెంటర్, రాజా వీధి మీదుగా ఎస్ఎస్ ఫంక్షన్ హాల్ వరకు సాగింది. భారీ సంఖ్యలో జనసైనికులు, వీర మహిళలు, యువత పాల్గొని పార్టీ జెండాలతో సందడి చేశారు. ర్యాలీలో జాతీయ జెండా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.అనంతరం ఎస్ఎస్ ఫంక్షన్ హాల్లో ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువతతో అనుసంధానమయ్యారు. ఈ సందర్భంగా ‘జై కొట్టు.. జనసేన యువజన విభాగం’ లోగో, గీతాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా తీగల చంద్రశేఖర్‌రావు మాట్లాడుతూ.. జనసేన యువజన విభాగం కేవలం ఒక నినాదం కాదని, యువత భవిష్యత్తుకు భరోసా అని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో యువత, మహిళలకు ప్రాధాన్యత కల్పించే దిశగా పార్టీ ముందుకు సాగుతుందని తెలిపారు.కె. మోహన్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా పార్టీ ఆదేశాల మేరకు కార్యక్రమాన్ని నిర్వహించామని, యువత ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా జనసేన యువజన విభాగం పనిచేస్తుందని పేర్కొన్నారు.కార్యక్రమంలో విజయ్, సాయి, అక్బర్, నవీన్, మురళి, సందీప్, కుమార్, వసంత, సుభాన్ తదితర నాయకులు, జనసైనికులు, వీర మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.












