అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నిర్ధారించుకోవాలి
అక్టోబర్ 9వ తేదీ సాయంత్రంలోపు దరఖాస్తులు అందజేయాలి: గూడూరు ఆర్డీవో అరుణకుమారి
గూడూరు, సెప్టెంబర్ 3 ప్రజా వీక్షణం ప్రతినిధి
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా చేపట్టిన ఓటర్ల పరిశీలన ప్రక్రియ గడువును ఎన్నికల సంఘం అక్టోబర్ 10వ తేదీ వరకు పొడిగించినట్లు గూడూరు రెవెన్యూ డివిజన్ అధికారి అరుణకుమారి తెలిపారు.ఓటర్ల జాబితాలో తమ పేరు ఉందో లేదో ప్రతి ఒక్కరూ పరిశీలించుకోవాలని ఆమె సూచించారు. ఓటు హక్కుకు అర్హత ఉన్నప్పటికీ ఓటర్ల జాబితాలో పేరు లేని వారు సంబంధిత ప్రాంతంలోని బూత్ స్థాయి అధికారులను సంప్రదించాలని తెలిపారు.ఓటర్ల జాబితాలో కొత్తగా పేరు నమోదు చేసుకోవాలనుకునే వారు ఆరు సంఖ్య దరఖాస్తు, ఓటర్ల జాబితాలో అనర్హుల పేర్లు తొలగించేందుకు ఏడు సంఖ్య దరఖాస్తు, ఓటరు పేరు, చిరునామా తదితర వివరాల్లో మార్పులు లేదా సవరణలు చేసుకోవడానికి ఎనిమిది సంఖ్య దరఖాస్తు ద్వారా తమ అభ్యర్థనలను సమర్పించవచ్చని వివరించారు.తమ అభ్యర్థనలు, అభ్యంతరాలను అక్టోబర్ 9వ తేదీ సాయంత్రంలోపు సంబంధిత బూత్ స్థాయి అధికారులకు అందజేయాలని ఆర్డీవో అరుణకుమారి సూచించారు. చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే దరఖాస్తులు సమర్పించాలని కోరారు. అర్హులైన ప్రతి పౌరుడు తమ పేరు ఓటర్ల జాబితాలో ఉందో లేదో తప్పనిసరిగా పరిశీలించుకోవాలని, పేరు లేకపోతే వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించి అవసరమైన దరఖాస్తును సమర్పించాలని తెలిపారు. అలాగే కొత్తగా ఓటు హక్కుకు అర్హత సాధించిన యువత తమ పేర్లను ఓటర్ల జాబితాలో నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు.ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని ఆమె తెలిపారు. ఎన్నికల సంఘం కల్పించిన ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని తమ ఓటు హక్కును నిర్ధారించుకోవాలని గూడూరు రెవెన్యూ డివిజన్ అధికారి అరుణకుమారి కోరారు.












