అమరావతి, సెప్టెంబర్ 3 (ప్రజా వీక్షణం ప్రతినిధి): ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో 31 కీలక అజెండా అంశాలకు ఆమోదం లభించింది. వ్యవసాయం, మత్స్యరంగం, సాగునీరు, విద్యుత్, అమరావతి అభివృద్ధి, పారిశ్రామిక రంగాలకు సంబంధించిన పలు ప్రతిపాదనలపై కేబినెట్ సుదీర్ఘంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంది.
రైతులకు ఆర్థిక చేయూత అందించే అంశానికి కేబినెట్ ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చింది. తోతాపురి మామిడి రైతులకు మద్దతు ధర కల్పించేందుకు మార్క్‌ఫెడ్ ద్వారా రూ.281 కోట్ల నిధులు సమకూర్చే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. అలాగే పొగాకు రైతులకు ప్రత్యక్ష నగదు బదిలీ విధానంలో రూ.94 కోట్ల ఆర్థిక సహాయం అందించేందుకు నిర్ణయం తీసుకుంది. మత్స్యరంగ అభివృద్ధికి తోడ్పడే రిజర్వాయర్ కేజ్ కల్చర్ పాలసీ-2026 ముసాయిదాకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.
రాజధాని అమరావతి అభివృద్ధికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శాఖమూరులో స్టేట్ పబ్లిక్ లైబ్రరీ, ఆడిటోరియం, గుడ్ గవర్నెన్స్ సంస్థలతో కూడిన ‘అమరావతి సంగమం’ నిర్మాణానికి రూ.759.79 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరు చేశారు. అమరావతిలో సిమెంట్ కాంక్రీట్ రోడ్లకు బదులుగా బీటీ రోడ్ల నిర్మాణం, అమరావతి రైల్వే కనెక్టివిటీ, ఇన్నర్ రింగ్ రోడ్డు పనుల పురోగతిపై కూడా కేబినెట్ చర్చించింది.
సాగునీటి రంగంలోనూ పలు ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో వరదల అనంతర పునరుద్ధరణ, సాగునీటి వ్యవస్థల మెరుగుదలకు సంబంధించిన 78 పనులకు రూ.6 కోట్లకు పైగా పరిపాలనా అనుమతులు మంజూరు చేశారు. వెలిగొండ టన్నెల్-2లో టన్నెల్ బోరింగ్ యంత్రం తొలగింపు పనులకు రూ.11.63 కోట్ల నిధుల కేటాయింపునకు ఆమోదం తెలిపారు. కాలువల నిర్వహణ, సాగునీటి హక్కులకు సంబంధించిన అంశాలపై కూడా మంత్రివర్గం చర్చించింది.
విద్యుత్ రంగానికి సంబంధించి ఏపీ ట్రాన్స్‌కో మధ్యకాలిక రుణాల కోసం రూ.950 కోట్ల ప్రభుత్వ హామీ ఇవ్వాలని నిర్ణయించారు. సీలేరు కాంప్లెక్స్‌లో ఏపీ జెన్‌కోకు ఫైర్ ప్రికాషనరీ ఫీజు మినహాయింపునకు ఆమోదం తెలిపారు. ఓక్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులో 800 మెగావాట్ల కేటాయింపును రద్దు చేయడం, విండ్-సోలార్ హైబ్రిడ్ ప్రాజెక్టుల సామర్థ్యాల మార్పిడి తదితర అంశాలపై కూడా నిర్ణయాలు తీసుకున్నారు.
పారిశ్రామిక మౌలిక వసతుల అభివృద్ధి, వివిధ ప్రభుత్వ సంస్థలకు భూ కేటాయింపులు, మార్కాపురంలో సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణం, కడప జిల్లాలో ప్రధానమంత్రి కుసుమ్ పథకం కింద సోలార్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలపై కూడా కేబినెట్ చర్చించి ఆమోదం తెలిపింది.
రైతుల సంక్షేమం, మౌలిక వసతుల విస్తరణ, అమరావతి అభివృద్ధి, విద్యుత్, సాగునీరు, పారిశ్రామిక రంగాల బలోపేతం లక్ష్యంగా కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయాలు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, సమగ్ర ప్రగతికి దోహదపడతాయని ప్రభుత్వం భావిస్తోంది.












