- గంజాయి రహిత జిల్లాగా అనకాపల్లిని తీర్చిదిద్దడమే లక్ష్యం
- ముగ్గురు అంతర్రాష్ట్ర నిందితుల అరెస్ట్
- పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం ప్రత్యేక గాలింపు
- సమర్థవంతంగా పనిచేసిన పోలీసులకు రివార్డులు
అనకాపల్లి, సెప్టెంబర్ 3 (ప్రజా వీక్షణంప్రతినిధి): అనకాపల్లి జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దే లక్ష్యంతో పోలీసులు చేపడుతున్న చర్యల్లో భాగంగా సుమారు రూ.3 కోట్ల విలువైన 600 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని ముగ్గురు అంతర్రాష్ట్ర నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా వెల్లడించారు. ఒడిశా రాష్ట్రం నుంచి అనకాపల్లి మీదుగా తుని ప్రాంతానికి తరలిస్తున్న గంజాయి లోడును అనకాపల్లి రూరల్ పోలీసులు ముందస్తు సమాచారంతో పట్టుకున్నారని తెలిపారు. గంజాయి రవాణాకు ఉపయోగించిన వ్యాన్‌తో పాటు పైలట్ వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఎస్పీ వివరాల ప్రకారం, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన షేక్ మస్తాన్ వలి గతంలో గంజాయి కేసులో విశాఖపట్నం కేంద్ర కారాగారంలో ఉన్న సమయంలో నర్సీపట్నానికి చెందిన మరో నిందితుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయాన్ని ఆసరాగా చేసుకుని ఒడిశాలోని మల్కన్‌గిరి ప్రాంతం నుంచి 600 కేజీల గంజాయిని సమకూర్చి తుని సమీపంలో అప్పగిస్తే భారీ కమీషన్ ఇస్తామని ఒప్పందం కుదిరినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. అనంతరం నిందితులు పక్కా ప్రణాళికతో గంజాయిని సరిహద్దులు దాటించి ఆంధ్రప్రదేశ్‌లోకి తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. చెక్‌పోస్టులను తప్పించేందుకు నిందితులు గంజాయిని విడతల వారీగా మోటార్ సైకిళ్లపై తరలించి అనంతరం ఒక వ్యాన్‌లో లోడ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. వ్యాన్‌కు ముందు పైలట్ వాహనంగా ఒక కారును ఏర్పాటు చేసి తుని వైపు బయలుదేరిన సమయంలో అనకాపల్లి మండలం సంపతిపురం జంక్షన్ వద్ద పోలీసులు మాటువేసి పట్టుకున్నారు. ఈ దాడిలో గంజాయి లోడుతో ఉన్న వ్యాన్, పైలట్ కారు రెండింటినీ స్వాధీనం చేసుకున్నారు. నిందితులు వినియోగించిన రవాణా పద్ధతి, నెట్‌వర్క్‌పై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.ఈ కేసులో షేక్ మస్తాన్ వలి, షేక్ మదీనా, పాంగి రత్నాలు అనే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉండగా వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు పేర్కొన్నారు. ప్రధాన నిందితుల్లో కొందరిపై ఇప్పటికే వివిధ జిల్లాల్లో గంజాయి అక్రమ రవాణా కేసులు నమోదై ఉన్నాయని, వారి నేర చరిత్రను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. పలుమార్లు నేరాలకు పాల్పడిన వ్యక్తులపై కఠిన చట్టాల కింద చర్యలు తీసుకునేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. గంజాయి అక్రమ రవాణాలో పాల్గొన్న కొందరు నిందితులపై గతంలో అల్లూరి సీతారామరాజు, కాకినాడ, అనకాపల్లి, ప్రకాశం జిల్లాల పరిధిలో పలు కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. ప్రధాన నిందితుల్లో ఒకరిపై మత్తు పదార్థాల నిరోధక చట్టాల కింద నిర్బంధ చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు ఎస్పీ తెలిపారు. జిల్లాలో మత్తు పదార్థాల అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు.ఈ భారీ గంజాయి పట్టివేతలో కీలక పాత్ర పోషించిన ప్రత్యేక శాఖ, అనకాపల్లి పట్టణ, రూరల్ పోలీస్ అధికారులు, ఈగల్ బృంద సభ్యులను జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ప్రత్యేకంగా అభినందించారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన అధికారులకు నగదు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. జిల్లాలో మత్తు పదార్థాల విక్రయాలు, రవాణాపై ఉక్కుపాదం మోపుతామని, అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్. మోహనరావు, మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ ఈ. శ్రీనివాసులు, ఇతర అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.












