- జల్ జీవన్ మిషన్–అమరజీవి జలధారలతో తాగునీటి సమస్యకు పరిష్కారం
- రూ.49.94 కోట్లతో తాగునీటి ప్రాజెక్టు పూర్తి
- దాదాపు 75 వేల మందికి స్వచ్ఛమైన తాగునీటి సరఫరా
అమరావతి, సెప్టెంబర్ 03, ప్రజా వీక్షణం ప్రతినిధి): ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు మండల ప్రజల దీర్ఘకాలిక తాగునీటి సమస్యకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపింది. కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగించేలా జల్ జీవన్ మిషన్–అమరజీవి జలధారల నిధులతో చేపట్టిన తాగునీటి ప్రాజెక్టు పూర్తయింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో రూ.49.94 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా వేలాది కుటుంబాలకు స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులోకి వచ్చింది. ఎ.కొండూరు మండల పరిధిలో 21 గ్రామ పంచాయతీలు, 38 ఆవాసాలు ఉండగా, చాలా ప్రాంతాలు దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించబడ్డాయి. తాగునీటి కొరత, కలుషిత జలాల వినియోగం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను గుర్తించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రాజెక్టును వేగవంతం చేసి పూర్తి చేయించారు.
గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రకటించినప్పటికీ టెండర్ ప్రక్రియను కూడా ప్రారంభించలేదని అధికారులు తెలిపారు. జల్ జీవన్ మిషన్ గడువు ముగిసే పరిస్థితుల్లో ఉన్న ఈ పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం పునరుద్ధరించి యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అవసరమైన నిధులను సమకూర్చి నిర్మాణ పనులను పూర్తి చేసింది. ఇబ్రహింపట్నం ఎన్టీపీసీ కాలువ నుంచి కృష్ణా జలాలను సేకరించి శుద్ధి చేసి ప్రజలకు అందించేలా ప్రాజెక్టును రూపొందించారు. 130 కిలోమీటర్ల పైప్లైన్, 12 ఎత్తైన నీటి నిల్వ ట్యాంకుల ద్వారా దాదాపు 75 వేల మందికి రోజుకు ఒక్కొక్కరికి 55 లీటర్ల చొప్పున స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేస్తున్నారు. గ్రామీణ నీటి సరఫరా శాఖతో పాటు పలు శాఖల సమన్వయంతో పనులను వేగంగా పూర్తి చేశారు.
ఇప్పటివరకు ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేసేందుకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు శాశ్వత తాగునీటి వసతి కల్పించడంతో ఆ భారం తగ్గడమే కాకుండా ప్రజల ఆరోగ్య పరిస్థితుల్లోనూ మెరుగుదల వస్తుందని అధికారులు భావిస్తున్నారు. కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్న ప్రాంత ప్రజలకు ఈ ప్రాజెక్టు ఎంతో ఉపయుక్తంగా మారనుంది. త్వరలో ఎ.కొండూరు ప్రాంతంలో పర్యటించనున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాగునీటి పథకం పనుల నాణ్యతను పరిశీలించనున్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులు పర్యటన ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపడుతుందని అధికారులు వెల్లడించారు.












