రూ.200 కోట్ల క్లబ్‌లో ‘ఆవారాపన్‌-2’

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 03 (ప్రజా వీక్షణం ప్రతినిధి): ఇమ్రాన్‌ హష్మి, దిశా పటానీ జంటగా దర్శకుడు నితిన్‌ కక్కర్‌ తెరకెక్కించిన యాక్షన్‌ గూఢచారి నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘ఆవారాపన్‌-2’ బాక్సాఫీస్‌ వద్ద దూసుకుపోతోంది. ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం భారీ వసూళ్లను సాధిస్తూ రూ.200 కోట్ల మార్కును దాటినట్లు చిత్ర బృందం తెలిపింది. దీంతో చిత్ర యూనిట్‌ ఆనందం వ్యక్తం చేస్తోంది.సినిమాకు లభిస్తున్న ప్రేక్షకాదరణపై కథానాయిక దిశా పటానీ సామాజిక మాధ్యమాల వేదికగా స్పందించారు. ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తుంచుకునేలా ఒక అద్భుతమైన కథను అందించే ఈ ప్రయాణంలో భాగం కావడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని ఆమె పేర్కొన్నారు. అంతేకాకుండా ఇంత మంచి మనసున్న వ్యక్తులతో కలిసి పనిచేసే అవకాశం లభించడం సంతోషంగా ఉందన్నారు.
‘ఆవారాపన్‌-2’ చిత్ర బృందంలో భాగం కావడం తనకు ఎంతో గౌరవంగా ఉందని దిశా తెలిపారు. సినిమాపై ప్రేక్షకులు చూపిస్తున్న అపారమైన ప్రేమకు ఎప్పటికీ కృతజ్ఞురాలినై ఉంటానని పేర్కొన్నారు. ఈ స్థాయిలో ప్రేక్షకుల ఆదరణ లభించడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఆనందం వ్యక్తం చేశారు.
రెండు దశాబ్దాల తర్వాత ఘన విజయం
2007లో మోహిత్‌ సూరి దర్శకత్వంలో ఇమ్రాన్‌ హష్మి, శ్రియా శరణ్‌ జంటగా ‘ఆవారాపన్‌’ చిత్రం తెరకెక్కింది. సుమారు రూ.18 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా అప్పట్లో దాదాపు రూ.12 కోట్ల వసూళ్లకే పరిమితమై ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అయితే దాదాపు రెండు దశాబ్దాల తర్వాత వచ్చిన ‘ఆవారాపన్‌-2’ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా భారీ విజయాన్ని అందుకుంటోంది.
తొలి భాగంతో పోలిస్తే సీక్వెల్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన రావడం, కథ, యాక్షన్‌ అంశాలతో పాటు నటీనటుల ప్రదర్శనకు ప్రశంసలు లభించడం సినిమాకు కలిసొచ్చిన అంశాలుగా చిత్ర వర్గాలు చెబుతున్నాయి. రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో చిత్ర బృందం మరింత ఉత్సాహంగా ఉంది.

error: Content is protected !!
Prajaveek Shanam