వాట్సాప్‌లోనే బిల్లుల చెల్లింపు

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 03 (ప్రజా వీక్షణం ప్రతినిధి): ప్రముఖ సందేశాల వేదిక వాట్సాప్‌ భారత్‌లో తన చెల్లింపుల సేవలను మరింత విస్తరించింది. వినియోగదారుల కోసం ‘బిల్లు చెల్లింపుల’ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో విద్యుత్‌, గ్యాస్‌, నీటి బిల్లులతో పాటు ఫాస్టాగ్‌, క్రెడిట్‌ కార్డు, రుణ వాయిదాలు వంటి వివిధ రకాల చెల్లింపులను నేరుగా వాట్సాప్‌ నుంచే చేసుకునే అవకాశం లభించనుంది.
ఈ సేవలను భారత్‌ బిల్‌పే వ్యవస్థ ఆధారంగా అందిస్తున్నారు. దేశవ్యాప్తంగా 30 రకాల విభాగాలకు చెందిన 22 వేలకు పైగా బిల్లర్లకు ఈ సదుపాయం ద్వారా చెల్లింపులు చేయవచ్చు. తొలుత దశలవారీగా ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుండగా, రానున్న కొన్ని వారాల్లో ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ వినియోగదారులందరికీ ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది.వాట్సాప్‌ ప్రధాన తెరపై కనిపించే రూపాయి గుర్తుపై నొక్కడం ద్వారా బిల్లు చెల్లింపుల విభాగంలోకి వెళ్లవచ్చు. అక్కడ అవసరమైన బిల్లు విభాగాన్ని ఎంచుకుని వివరాలు నమోదు చేసి చెల్లింపు పూర్తి చేసుకోవచ్చు. గతంలో చెల్లించిన బిల్లుల వివరాలు, రాబోయే చెల్లింపుల సమాచారాన్ని కూడా వినియోగదారులు పరిశీలించుకునే వీలు ఉంటుంది.
బిల్లుల చెల్లింపులకు కేవలం యూపీఐ మాత్రమే కాకుండా క్రెడిట్‌, డెబిట్‌ కార్డులను కూడా ఉపయోగించుకునే సౌకర్యాన్ని కల్పించారు. దీంతో వేర్వేరు బిల్లుల కోసం ప్రత్యేకంగా సంబంధిత సంస్థల వెబ్‌సైట్లు లేదా ఇతర అనువర్తనాలను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా ఒకే వేదికపై చెల్లింపులు పూర్తి చేసుకునే అవకాశం ఏర్పడింది.
భారత్‌లో ఇప్పటికే కుటుంబ సభ్యులు, స్నేహితులతో మాట్లాడటానికి, వ్యాపార సంస్థలను సంప్రదించడానికి, వివిధ సేవలను పొందడానికి వాట్సాప్‌ను కోట్లాది మంది ఉపయోగిస్తున్నారని సంస్థ ప్రతినిధులు తెలిపారు. బిల్లుల చెల్లింపును కూడా సందేశం పంపినంత సులభంగా మార్చడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
ఫిన్‌టెక్‌ రంగంలో వాట్సాప్‌ మరింత విస్తరించేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో తాజా సదుపాయానికి ప్రాధాన్యం ఏర్పడింది. గత రెండేళ్లలో వాట్సాప్‌ చెల్లింపుల లావాదేవీలు గణనీయంగా పెరిగాయి. 2024 జూన్‌లో సుమారు 3.7 కోట్లుగా ఉన్న లావాదేవీలు 2026 జూన్‌ నాటికి దాదాపు 15 కోట్లకు చేరుకున్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి.
యూపీఐ లావాదేవీల్లోనూ వాట్సాప్‌ వాటా ఇదే కాలంలో 0.27 శాతం నుంచి 0.7 శాతానికి పెరిగింది. తాజాగా బిల్లుల చెల్లింపుల సదుపాయం అందుబాటులోకి రావడంతో వాట్సాప్‌ చెల్లింపుల వినియోగం మరింత పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

error: Content is protected !!
Prajaveek Shanam