గుడివాడ, సెప్టెంబర్ 4, (ప్రజా వీక్షణం ప్రతినిధి): కష్టకాలంలో పార్టీ కార్యకర్తల కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. ప్రమాదవశాత్తు మృతి చెందిన ముగ్గురు టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు సభ్యత్వ బీమా పథకం కింద మంజూరైన రూ.15 లక్షల చెక్కులను శుక్రవారం గుడివాడ ప్రజావేదిక కార్యాలయంలో పంపిణీ చేశారు. కూటమి నాయకులతో కలిసి బాధిత కుటుంబాలకు బీమా సాయం అందజేస్తూ వారికి ధైర్యం చెప్పారు.గుడ్లవల్లేరుకు చెందిన గుమ్మడి శ్రావణి కుటుంబానికి, అంగులూరుకు చెందిన చింతా విజయలక్ష్మి కుటుంబానికి, వడ్లమన్నాడుకు చెందిన కొనతం శ్రీరామమూర్తి కుటుంబానికి ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున బీమా చెక్కులు అందజేశారు. మొత్తం రూ.15 లక్షల ఆర్థిక సాయాన్ని సభ్యత్వ బీమా పథకం ద్వారా బాధిత కుటుంబాలకు అందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ సాయం వారి కుటుంబాలకు కొంత భరోసా కల్పిస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ, తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన క్లిష్ట సమయంలో బీమా సాయం అందించడం ఎంతో ఉపశమనం కలిగించిందన్నారు. సభ్యత్వ బీమా ద్వారా ఆర్థికంగా అండగా నిలిచిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సహాయం తమ కుటుంబాలకు భవిష్యత్తుపై కొంత నమ్మకాన్ని కల్పించిందని పేర్కొన్నారు.
కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి వెన్నెముక అని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే ప్రతి కార్యకర్త సంక్షేమం తమకు అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. కార్యకర్తలు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అండగా నిలవాలన్నదే పార్టీ అధిష్ఠానం లక్ష్యమని చెప్పారు. అందుకే సభ్యత్వ బీమా వంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు వివరించారు.
పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకు, వారి కుటుంబాలకు అవసరమైన సమయంలో సహాయం అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే తెలిపారు. కార్యకర్తల సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు. పార్టీని బలోపేతం చేయడంలో కార్యకర్తల పాత్రను ఎప్పటికీ మరువబోమన్నారు. భవిష్యత్తులో కూడా బాధిత కుటుంబాలకు అవసరమైన సహకారం అందించేందుకు పార్టీ, ప్రభుత్వ పరంగా తనవంతు కృషి కొనసాగుతుందని వెనిగండ్ల రాము హామీ ఇచ్చారు. కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలవడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు, బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.












