
చిల్లకూరు: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం ఏరూరు గ్రామానికి చెందిన ప్రముఖ సైకత శిల్పి మంచాల సనత్ కుమార్ వినూత్న సైకత శిల్పాన్ని రూపొందించారు. మాజీ రాష్ట్రపతి, ఆదర్శ ఉపాధ్యాయుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రంతో పాటు పుస్తకం ఆకారంలో రూపొందించిన ఈ సైకత శిల్పం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది.ఈ సందర్భంగా సైకత శిల్పి మంచాల సనత్ కుమార్ మాట్లాడుతూ.. మన జీవితంలో తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు సరైన మార్గదర్శకత్వం అందిస్తూ, వారి వ్యక్తిత్వ వికాసానికి బాటలు వేసే ఉపాధ్యాయులే నిజమైన హీరోలని పేర్కొన్నారు. విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దే గురువులందరికీ తన సైకత శిల్పాన్ని అంకితం చేస్తున్నట్లు తెలిపారు.ఉపాధ్యాయుల సేవలను స్మరించుకుంటూ, సమాజ నిర్మాణంలో వారి పాత్రను గుర్తుచేస్తూ ఈ ప్రత్యేక శిల్పాన్ని రూపొందించినట్లు సనత్ కుమార్ వెల్లడించారు. ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.












