కనులపండువగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

గూడూరు: గూడూరు పట్టణంలోని రాజా వీధిలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు భక్తిశ్రద్ధలతో, కనులపండువగా ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణ భక్త బృందం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి శ్రీకృష్ణ పరమాత్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా రాజా వీధిలోని శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానం వద్ద శ్రీకృష్ణుని బొమ్మల కొలువును ప్రత్యేక అలంకరణలతో ఏర్పాటు చేశారు. శ్రీకృష్ణుడి బాల్య లీలలు, పౌరాణిక ఘట్టాలను ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. సాయంత్రం చిన్నారులు వివిధ పౌరాణిక పాత్రల వేషధారణలతో అలరించారు. పాండవులు, కౌరవుల వేషధారణలో చిన్నారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.అనంతరం శ్రీకృష్ణ పరమాత్మను పంచ గుర్రాల రథంపై ఆశీనుడిని చేసి పట్టణ పురవీధుల్లో వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు. కోలాటాలు, తీన్మార్ డప్పుల నడుమ జరిగిన ఊరేగింపు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. రథం ముందు కళాకారుల నృత్యాలు, డప్పుల మోత, భక్తుల జయజయధ్వానాలతో రాజా వీధి మొత్తం ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగింది.గ్రామోత్సవం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీకృష్ణుని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్సవంలో పాల్గొన్న భక్తులకు నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు.ఊరేగింపు అనంతరం శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానం వద్ద భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు అన్నప్రసాదాలు స్వీకరించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించిన శ్రీకృష్ణ భక్త బృందం సభ్యులను పలువురు అభినందించారు.

గూడూరు ప్రజా వీక్షణం సెప్టెంబర్ 04

error: Content is protected !!
Prajaveek Shanam