తండ్రిని హత్య చేసిన తనయుడు

ఒక్క రోజులోనే కేసును ఛేదించిన పెనుమూరు పోలీసులు

చిత్తూరు: కుటుంబ విభేదాల నేపథ్యంలో తండ్రిని కోడి కత్తితో దారుణంగా హత్య చేసిన తనయుడిని పెనుమూరు పోలీసులు ఒక్క రోజులోనే అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి హత్యకు ఉపయోగించిన కోడి కత్తి, ద్విచక్ర వాహనం, రక్తపు మరకలు ఉన్న చొక్కాతో పాటు కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు.పోలీసుల వివరాల మేరకు.. పెనుమూరు ప్రాంతానికి చెందిన ఎస్. జోకేష్ రెడ్డి అలియాస్ బాలాజీ కొంతకాలంగా కుటుంబ విభేదాల కారణంగా భార్యతో కలిసి వేరుగా నివసిస్తున్నాడు. నిందితుడు తరచూ మద్యం సేవించి ఇంట్లో గొడవలు చేయడంతో పాటు గ్రామంలో అప్పులు చేసిన విషయాన్ని అతని భార్య, తండ్రి చెంగా రెడ్డికి తెలిపింది.ఈ నేపథ్యంలో కుమారుడిని మందలించేందుకు తండ్రి ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న జోకేష్ రెడ్డి.. తన మద్యపానం, అప్పుల విషయమై తండ్రి భార్య ఎదుట మందలించి అవమానిస్తాడనే ఆగ్రహంతో హత్యకు పథకం వేసినట్లు పోలీసులు తెలిపారు.ముందుగానే కోడి కత్తిని వెంట తీసుకుని ద్విచక్ర వాహనంపై తల్లిదండ్రుల ఇంటికి వెళ్లాడు. అక్కడ మద్యం, అప్పుల విషయమై తండ్రి మందలించడంతో ఆగ్రహానికి గురైన నిందితుడు.. వెంట తెచ్చుకున్న కోడి కత్తితో తండ్రిపై దాడి చేసి హత్య చేశాడు. అనంతరం ద్విచక్ర వాహనంపై అక్కడి నుంచి పరారయ్యాడు.మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పెనుమూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. చిత్తూరు ఎస్‌డీపీఓ జె. వెంకటనారాయణ పర్యవేక్షణలో, ఈస్ట్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కె. రామచంద్ర ఆధ్వర్యంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.ఘటన జరిగిన మరుసటి రోజే పెనుమూరు మండలం సాయినగర్ కాలనీ సమీపంలో నిందితుడు జోకేష్ రెడ్డి అలియాస్ బాలాజీని పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. నిందితుడి ఒప్పుకోలు మేరకు హత్యకు ఉపయోగించిన కోడి కత్తి, ద్విచక్ర వాహనం, రక్తపు మరకలు ఉన్న చొక్కాను స్వాధీనం చేసుకున్నారు.కేసును కేవలం ఒక్క రోజులోనే ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసు బృందాన్ని జిల్లా ఎస్పీ తుషార్ డూడి అభినందించారు. కేసు దర్యాప్తులో ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బందికి రివార్డులు ప్రకటించారు.

ప్రజా వీక్షణం చిత్తూరు సెప్టెంబర్ 04

error: Content is protected !!
Prajaveek Shanam