50 ఇళ్లలో సోదాలు.. పత్రాలు లేని మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం
కోట: నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడి, ప్రజల భద్రతే లక్ష్యంగా జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం కోట పోలీస్స్టేషన్ పరిధిలోని కేశవరం గ్రామం నక్కల కాలనీలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు.కోట సబ్ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ఏడుగురు పోలీసు సిబ్బందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి కాలనీలోని సుమారు 50 ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో సరైన ఆధార పత్రాలు లేని మూడు ద్విచక్ర వాహనాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. తదుపరి పరిశీలన నిమిత్తం వాటిని పోలీసుల ఆధీనంలో ఉంచారు.అనంతరం స్థానిక ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాలలపై లైంగిక నేరాల నుంచి రక్షణ చట్టం, చిన్నారుల రక్షణ, మాదకద్రవ్యాల నిర్మూలన, మహిళల భద్రత, శిరస్త్రాణం వినియోగం, రహదారి భద్రతా నిబంధనలు, అంతర్జాల మోసాల నివారణ తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో భాగంగా జిల్లాలో ఇటువంటి విస్తృత పోలీసు తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని జిల్లా పోలీసులు తెలిపారు.
కోట (ప్రజా వీక్షణం) సెప్టెంబర్ 04












