అమరావతి, సెప్టెంబర్ 5 (ప్రజా వీక్షణం ప్రతినిధి):
ఎస్సీ, ఎస్టీల రక్షణ, సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం అమలు, సంక్షేమ కార్యక్రమాలపై రాష్ట్రస్థాయి హైపవర్ పర్యవేక్షక కమిటీ సమావేశం శనివారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగింది. ముఖ్యమంత్రి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో ఎస్సీ, ఎస్టీల భద్రత, హక్కుల పరిరక్షణకు రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న చర్యలపై విస్తృతంగా సమీక్షించారు.రాష్ట్ర, జిల్లా, డివిజన్ స్థాయిల్లో ఎస్సీ, ఎస్టీలపై జరిగే అత్యాచారాలను అరికట్టేందుకు అమలు చేస్తున్న చర్యలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అత్యాచారాల నిరోధక చట్టం సమర్థవంతంగా అమలయ్యేలా తీసుకుంటున్న చర్యలు, కేసుల దర్యాప్తు పురోగతి, బాధితులకు అందుతున్న సహాయంపై సమీక్ష నిర్వహించారు. చట్ట అమలులో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
సంక్షేమ పథకాల అమలుపైనా చర్చ
ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, వాటి ఫలితాలపై కూడా సమావేశంలో చర్చించారు. విద్య, ఉపాధి, ఆర్థిక సాధికారత, గృహ నిర్మాణం, భూముల పరిరక్షణ తదితర అంశాల్లో చేపడుతున్న కార్యక్రమాలపై అధికారులు నివేదికలు సమర్పించారు. సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.
సమాజంలో వెనుకబడిన వర్గాలకు న్యాయం జరిగేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన అన్నారు. ఎస్సీ, ఎస్టీలపై వివక్ష, దాడుల ఘటనలను తీవ్రంగా పరిగణించాలని, బాధితులకు వెంటనే న్యాయం అందేలా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచించారు. చట్టాల అమలుతో పాటు ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలను కూడా విస్తృతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
పలువురు మంత్రులు, అధికారులు హాజరు
ఈ సమావేశానికి మంత్రులు డీబీవీ స్వామి, వి. అనిత, జి. సంధ్యారాణి, ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలకు చెందిన ఎంపీలు కృష్ణప్రసాద్, దగ్గుమళ్ల ప్రసాద్, పలువురు ఎమ్మెల్యేలు, కమిటీ సభ్యులు హాజరయ్యారు. హోంశాఖ కార్యదర్శి కుమార్ విశ్వజిత్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్, న్యాయశాఖ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.ఎస్సీ, ఎస్టీల హక్కుల పరిరక్షణ, సంక్షేమ కార్యక్రమాల అమలులో మరింత సమర్థత సాధించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సమావేశంలో స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని స్థాయిల్లో పర్యవేక్షణను మరింత బలోపేతం చేసి, సమస్యలను వేగంగా పరిష్కరించే దిశగా చర్యలు కొనసాగించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.












