12వ పీఆర్సీకి గ్రీన్‌సిగ్నల్.. రెండు డీఏలు విడుదలకు నిర్ణయం
పెన్షనర్లకు అదనపు క్వాంటం.. ఉద్యోగుల సంక్షేమంపై కీలక ప్రకటనలు
అమరావతి, సెప్టెంబర్ 5 (ప్రజా వీక్షణం ప్రతినిధి):
ఉద్యోగులు ప్రభుత్వంలో అంతర్భాగమని, వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఉద్యోగ సంఘాల నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించి ముఖ్యమైన నిర్ణయాలను ప్రకటించారు. ఉద్యోగుల సమస్యలను సానుకూలంగా పరిశీలిస్తూ సాధ్యమైనంత సహాయం అందిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
12వ పీఆర్సీకి అంగీకారం
ఉద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న 12వ వేతన సవరణ సంఘం (పీఆర్సీ) నియామకానికి ముఖ్యమంత్రి అంగీకారం తెలిపారు. అలాగే 2024 జూలై 1, 2025 జనవరి 1 తేదీలకు సంబంధించిన రెండు డీఏలను విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ రెండు డీఏల చెల్లింపులు 2026 అక్టోబర్ 1 నుంచి అమలులోకి వస్తాయని వెల్లడించారు.
సరెండర్ లీవ్ నగదు చెల్లింపులు
2022 సంవత్సరానికి సంబంధించిన సరెండర్ లీవ్ నగదును వచ్చే సంక్రాంతి నాటికి ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయడానికి ప్రభుత్వం అంగీకరించింది. పోలీసు సిబ్బందికి అదనంగా ఒక సరెండర్ లీవ్‌ను ఈ దసరా సందర్భంగా చెల్లించాలని నిర్ణయించారు.
పెన్షనర్లకు అదనపు ప్రయోజనం
పెన్షనర్ల సంక్షేమానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2027 జనవరి నుంచి అదనపు క్వాంటం ఆఫ్ పెన్షన్ అమలు చేయాలని నిర్ణయించారు. 70 ఏళ్లు దాటిన పెన్షనర్లకు 10 శాతం, 75 ఏళ్లు దాటిన వారికి 15 శాతం మేర అదనపు పెన్షన్ ప్రయోజనం కల్పించనున్నారు.
ఉద్యోగుల ఆరోగ్య పథకంపై చర్యలు
ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు సంబంధించిన ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్‌ను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నెల నుంచి ప్రతి నెలకు సంబంధించిన చెల్లింపులను అదే నెలలో ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్‌కు అందించే విధంగా చర్యలు తీసుకోనుంది. దీంతో ఉద్యోగుల ఆరోగ్య సేవల అమలులో జాప్యం తగ్గే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ప్రభుత్వంపై రూ.2,880 కోట్ల అదనపు భారం
ఉద్యోగులు, పెన్షనర్ల కోసం ప్రకటించిన ఈ నిర్ణయాల వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతి ఏడాది సుమారు రూ.2,880 కోట్ల అదనపు ఆర్థిక భారం పడనుంది. అయినప్పటికీ ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఉద్యోగ సంఘాల ప్రతినిధులు స్వాగతించారు. ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించేందుకు సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రికి వారు కృతజ్ఞతలు తెలిపారు.












