మతసామరస్యం, శాంతిభద్రతల పరిరక్షణే ప్రథమ ప్రాధాన్యం
గణేష్ ఉత్సవాలపై ప్రత్యేక చర్యలు : జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్
గుంటూరు, సెప్టెంబర్ 6: రాబోయే వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు గుంటూరు జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. గణేష్ మండపాల ఏర్పాటుకు భక్తులు, ఉత్సవ కమిటీ నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆన్లైన్ సింగిల్ విండో విధానం ద్వారా సులభంగా, సత్వరంగా అనుమతులు మంజూరు చేయనున్నట్లు గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్, ఐపీఎస్ తెలిపారు.గణేష్ మండపాల అనుమతుల కోసం పోలీస్, అగ్నిమాపక, మున్సిపల్, విద్యుత్, రెవెన్యూ తదితర శాఖల నుంచి అవసరమైన అనుమతులను ఒకే చోట పొందేలా ganeshutsav.net వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే సదుపాయం అందుబాటులో ఉందని ఎస్పీ తెలిపారు. ఈ సింగిల్ విండో విధానం ద్వారా అనుమతుల ప్రక్రియను సులభతరం చేయడంతో పాటు పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
నిర్వాహకులు ముందుగానే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని, సంబంధిత శాఖల నిబంధనలను పాటిస్తూ అనుమతులు పొందాలని ఎస్పీ సూచించారు. మండపాల ఏర్పాటులో నిర్వాహకులు బాధ్యతాయుతంగా వ్యవహరించి అధికారులకు పూర్తి సహకారం అందించాలని కోరారు.
మండపాల వద్ద క్షేత్రస్థాయి తనిఖీలు
జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల హౌస్ ఆఫీసర్లు తమ పరిధిలో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న ప్రతి గణేష్ మండపాన్ని స్వయంగా సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఎస్పీ ఆదేశించారు.మండపం ఏర్పాటు చేసే ప్రదేశం, రహదారికి ఉన్న దూరం, ప్రజల రాకపోకలకు ఇబ్బందులు, అత్యవసర వాహనాల రాకపోకలకు అవకాశం, విద్యుత్ వైరింగ్, అగ్నిమాపక భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం మాత్రమే తుది అనుమతులు జారీ చేయాలని స్పష్టం చేశారు.
అగ్ని, విద్యుత్ భద్రతకు ప్రాధాన్యం
మండపాల వద్ద విద్యుత్ వైరింగ్, విద్యుత్ కనెక్షన్లు, జనరేటర్లు, లైటింగ్ ఏర్పాట్ల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని ఎస్పీ అధికారులను ఆదేశించారు. అగ్ని ప్రమాదాలను నివారించేందుకు అవసరమైన ఫైర్ సేఫ్టీ పరికరాలు, అగ్నిమాపక సిలిండర్లు అందుబాటులో ఉంచాలని నిర్వాహకులకు సూచించారు.అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను సురక్షితంగా బయటకు తరలించే విధంగా తగిన ఏర్పాట్లు చేయాలని తెలిపారు.
ట్రాఫిక్కు అంతరాయం లేకుండా చర్యలు
గణేష్ మండపాల ఏర్పాటు వల్ల సాధారణ ట్రాఫిక్కు, ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ ఆదేశించారు.ప్రధాన రహదారులు, కూడళ్లు, ఆసుపత్రులు, పాఠశాలలు, మార్కెట్ల వద్ద మండపాల ఏర్పాటుపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అవసరమైన ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ ట్రాఫిక్ మార్గాలను ముందుగానే గుర్తించాలని, మండపాల వద్ద పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని కోరారు.
నిమజ్జనానికి ముందస్తు ప్రణాళిక
వినాయక నిమజ్జన ఊరేగింపు మార్గాలు, నిమజ్జనం చేసే ప్రదేశాలు, ఊరేగింపు తేదీ, సమయం తదితర అంశాలను ముందుగానే సమీక్షించి అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు.
నిమజ్జన ప్రాంతాల్లో ప్రజల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, బారికేడింగ్, లైటింగ్, అత్యవసర సేవలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
సీసీ కెమెరాలు, పోలీస్ నిఘా
ముఖ్యమైన గణేష్ మండపాలు, రద్దీ ప్రాంతాలు, ఊరేగింపు మార్గాలు, నిమజ్జన ప్రదేశాల్లో అవసరమైన మేరకు సీసీ కెమెరాలు, పోలీస్ నిఘా ఏర్పాటు చేయాలని ఎస్పీ సూచించారు.
సున్నితమైన ప్రాంతాలను ముందుగానే గుర్తించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా తగిన బందోబస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
అనుమతుల దరఖాస్తులు పెండింగ్లో ఉంచొద్దు
గణేష్ మండపాల అనుమతుల కోసం వచ్చే దరఖాస్తులను అనవసరంగా పెండింగ్లో ఉంచకుండా, నిబంధనల మేరకు వీలైనంత త్వరగా పరిశీలించి పరిష్కరించాలని ఎస్పీ అధికారులకు సూచించారు.
అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ నిర్వాహకులకు అవసరమైన సహకారం అందించాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అనుమతుల ప్రక్రియను సత్వరం పూర్తి చేయాలని ఆదేశించారు.
మతసామరస్యానికి భంగం కలగకుండా సంయమనం
గణేష్ ఉత్సవాల సందర్భంగా కుల, మత సామరస్యానికి ఎలాంటి భంగం కలగకుండా ప్రతి ఒక్కరూ సంయమనంతో వ్యవహరించాలని ఎస్పీ వకుల్ జిందాల్ విజ్ఞప్తి చేశారు.ఇతర మతాలు, వర్గాల మనోభావాలను గౌరవిస్తూ ఉత్సవాలను నిర్వహించాలని, వివాదాస్పద వ్యాఖ్యలు, నినాదాలు, రెచ్చగొట్టే చర్యలకు పాల్పడవద్దని సూచించారు.సోషల్ మీడియాలో పుకార్లు, తప్పుడు సమాచారం లేదా వివాదాలకు దారితీసే పోస్టులను ప్రచారం చేయవద్దని ప్రజలను అప్రమత్తం చేశారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు
గణేష్ ఉత్సవాల సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఎవరైనా వ్యవహరించినా, చట్టాన్ని ఉల్లంఘించినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు.గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో, ప్రశాంతమైన వాతావరణంలో విజయవంతంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీలు, ప్రజలు పోలీస్ శాఖకు పూర్తి సహకారం అందించాలని కోరారు.ప్రజల భద్రత, మతసామరస్యం, శాంతిభద్రతల పరిరక్షణే పోలీస్ శాఖ ప్రథమ ప్రాధాన్యమని ఎస్పీ వకుల్ జిందాల్ స్పష్టం చేశారు.
Guntur District
– గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయం












