రాబందుల రక్షణతో పర్యావరణ సమతుల్యత

రాబందుల సంరక్షణకు సమష్టి కృషి అవసరం: కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్

పంచకులా, సెప్టెంబర్ 6, (ప్రజా వీక్షణం ప్రతినిధి):

అంతర్జాతీయ రాబందుల అవగాహన దినోత్సవం–2026 సందర్భంగా హర్యానాలోని పంచకులాలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాలకు కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా “సంక్షోభం నుంచి పునరుద్ధరణ వరకు – భారత రాబందుల సంరక్షణ” అనే అంశంపై నిర్వహించిన జాతీయ కార్యశాలను ఆయన ప్రారంభించారు. రాబందుల పరిరక్షణకు ప్రభుత్వం, శాస్త్రవేత్తలు, పర్యావరణ సంస్థలు సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
కార్యశాలలో మాట్లాడిన భూపేందర్ యాదవ్, పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో రాబందులు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ప్రకృతిలో మృత జంతువులను త్వరగా తొలగించడం ద్వారా వ్యాధుల వ్యాప్తిని అరికట్టడంలో ఈ పక్షులు ముఖ్యమైన సేవలు అందిస్తున్నాయని చెప్పారు. గత కొన్ని దశాబ్దాల్లో రాబందుల సంఖ్య గణనీయంగా తగ్గినప్పటికీ, సంరక్షణ చర్యల వల్ల పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందని వివరించారు.రాబందుల సంరక్షణ కోసం దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన “వల్చర్ సేఫ్ జోన్స్” విస్తరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కేంద్ర మంత్రి సూచించారు. రాబందులకు హానికరమైన మందుల వినియోగాన్ని నియంత్రించడం, వాటి నివాస ప్రాంతాలను రక్షించడం, సహజ ఆవాసాలను పునరుద్ధరించడం వంటి చర్యలు మరింత వేగవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అడవుల్లో రాబందుల జాతి పునరుద్ధరణ కోసం సాంకేతిక సామర్థ్యాలను మరింత పెంపొందించాల్సిన అవసరం ఉందని భూపేందర్ యాదవ్ పేర్కొన్నారు. శాస్త్రీయ పరిశోధనలు, జాతి పర్యవేక్షణ, సంరక్షణ కేంద్రాల బలోపేతం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని చెప్పారు. దేశంలో రాబందుల సంరక్షణకు సంబంధించిన సుదీర్ఘ ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.కార్యశాలలో పర్యావరణ నిపుణులు, శాస్త్రవేత్తలు, అటవీ శాఖ అధికారులు, వన్యప్రాణి సంరక్షణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. రాబందుల సంఖ్య పెంపు, సంరక్షణ చర్యలు, ఎదురవుతున్న సవాళ్లు, భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న విజయవంతమైన సంరక్షణ నమూనాలను కూడా ప్రదర్శించారు. భారతదేశంలో రాబందుల పునరుద్ధరణకు చేపడుతున్న చర్యలు ఆశాజనక ఫలితాలను ఇస్తున్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం కూడా అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. రాబందుల వంటి కీలక జీవజాతులను రక్షించడం ద్వారా జీవ వైవిధ్యాన్ని కాపాడటంతో పాటు భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

error: Content is protected !!
Prajaveek Shanam