
అమరావతి, సెప్టెంబర్ 8 (ప్రజా వీక్షణం ప్రతినిధి): ప్రజలకు ప్రభుత్వ, పరిపాలనా సేవలను మరింత సమర్థవంతంగా అందించడంపై ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు ప్రత్యేక దృష్టి పెట్టాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. రెండో రోజు నిర్వహించిన లీడర్షిప్ కాన్క్లేవ్లో ఆయన ప్రసంగించారు.కొన్ని నియోజకవర్గాల్లో పౌర సేవల అమలులో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారని చంద్రబాబు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో అనుసరిస్తున్న ఉత్తమ విధానాలను రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో అమలు చేయాలని సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
ఉచిత ఇసుకపై కఠిన పర్యవేక్షణ
ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఉచిత ఇసుక విధానాన్ని ప్రభుత్వం కట్టుదిట్టంగా అమలు చేస్తోందని చంద్రబాబు తెలిపారు. ఈ విధానం వల్ల ప్రభుత్వానికి ఏటా సుమారు రూ.1,000 కోట్ల ఆదాయం కోల్పోతున్నప్పటికీ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా కొనసాగిస్తున్నామని చెప్పారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలని, ముఖ్యంగా ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలిపోకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
మద్యం విక్రయాల్లో అక్రమాలకు చెక్
గత ప్రభుత్వ హయాంలో మద్యం విధానం అస్తవ్యస్తంగా మారిందని చంద్రబాబు విమర్శించారు. ప్రస్తుతం మద్యం విక్రయాల్లో పారదర్శకత తీసుకొచ్చామని తెలిపారు. ఎమ్మార్పీ కంటే ఒక్క రూపాయి ఎక్కువకు విక్రయించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మద్యం విక్రయాల్లో అవకతవకలు జరగకుండా పర్యవేక్షించాల్సిన బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులపై ఉందన్నారు.
ఫేక్ ప్రచారాన్ని వాస్తవాలతో తిప్పికొట్టాలి
ప్రభుత్వంపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను వాస్తవాలతో సమర్థంగా తిప్పికొట్టాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అనేక ప్రభుత్వ సేవలను ఆన్లైన్లో ప్రజలకు అందిస్తున్నామని తెలిపారు. క్యూఆర్ కోడ్, బ్లాక్‌చెయిన్ సాంకేతికత ఆధారంగా భద్రమైన పట్టాదారు పాస్ పుస్తకాలను జారీ చేస్తున్నట్లు వివరించారు.
పెండింగ్ సమస్యల పరిష్కారంపై దృష్టి
నియోజకవర్గాల్లో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను స్వచ్ఛందంగా గుర్తించి పరిష్కరించాలని ఎమ్మెల్యేలకు సూచించారు. ప్రజల సమస్యల పట్ల మానవత్వంతో స్పందిస్తే సానుకూల దృక్పథం ఏర్పడుతుందని అన్నారు. ప్రజలతో నిరంతరం సంబంధాలు కొనసాగిస్తూ వారి అవసరాలను అర్థం చేసుకుని పరిష్కార మార్గాలు చూపాలని సూచించారు.
2027 మార్చి నాటికి భూ రికార్డుల ప్రక్షాళన
రాష్ట్రవ్యాప్తంగా భూ వివాదాల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని చంద్రబాబు వెల్లడించారు. 2027 మార్చి నాటికి భూ రికార్డుల ప్రక్షాళన పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ‘సంజీవని’ ప్రాజెక్టు ద్వారా ప్రజలకు డిజిటల్ ఆరోగ్య రికార్డులు అందుబాటులోకి తీసుకువస్తున్నామని చెప్పారు.
ఇదిలా ఉండగా, గత సమావేశంలో ఎమ్మెల్యేలు ప్రస్తావించిన అంశాలను సమీక్షించిన ప్రభుత్వం రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో రూ.20,400 కోట్ల విలువైన 616 అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపిందని చంద్రబాబు వెల్లడించారు.












