– సౌభాగ్యం, సుమంగళి వరాల కోసం మహిళల ప్రత్యేక పూజ
వినాయక చవితి అనగానే గణపతి విగ్రహాలు, పూజలు, నిమజ్జనాలు గుర్తొస్తాయి. కానీ ఆ పండుగకు ముందురోజే ఇంటింటా మరో ముఖ్యమైన పూజ జరుగుతుంది. అదే గౌరీపూజ. గణేశుడిని ఇంటికి ఆహ్వానించే ముందు తల్లి గౌరీదేవిని పూజించడం ఆనవాయితీగా వస్తోంది.పురాణాల ప్రకారం గౌరీదేవి పార్వతీదేవి అవతారం. శక్తికి మూలం, మంగళానికి ప్రతీక. బిడ్డను ఇంటికి పిలిచే ముందు తల్లిని ఆహ్వానించడం మన సంస్కృతి. అందుకే భాద్రపద శుద్ధ తదియ నాడు గౌరీపూజ చేసి, మరుసటి రోజు చవితి నాడు గణపతిని ప్రతిష్టిస్తారు. దీనినే గౌరీ గణేష్ పండుగ, గౌరీ చౌతి అని కూడా పిలుస్తారు.మహిళలకు అత్యంత ప్రీతికరం:ఈ పూజ ప్రధానంగా వివాహిత మహిళలు చేస్తారు. గౌరీదేవిని ఆరాధిస్తే సుఖ సంతోషాలు, సంపద, భర్తకు దీర్ఘాయుష్షు, సుదీర్ఘ సుమంగళీ జీవితం లభిస్తుందని నమ్మకం. ఈ పూజ వరమహాలక్ష్మి వ్రతం లాంటిదే. తేడా ఏమిటంటే లక్ష్మీ స్థానంలో గౌరీని పూజిస్తారు.
ఆచారం ఎలా?:
తదియ నాడు ఉదయాన్నే మహిళలు పసుపు ముద్దను లేదా గౌరీ విగ్రహాన్ని పీటపై ప్రతిష్టించి, బియ్యం లేదా ధాన్యాల కలశం ఉంచుతారు. పసుపు, కుంకుమ, పూలు, గాజులు, కొత్త చీరతో అమ్మవారిని అలంకరించి పండ్లు, పాయసం నైవేద్యంగా పెట్టి కథ వింటారు. కొన్ని ప్రాంతాల్లో గౌరీతో పాటు గణేశుడి సోదరీమణులుగా మరో రెండు చిన్న విగ్రహాలను కూడా తెచ్చి పూజిస్తారు.మరుసటి రోజు గణేశ చతుర్థి నాడు గణపతిని ప్రతిష్టించి పూజలు ప్రారంభిస్తారు. సిరిసంపదలు, జ్ఞానం, ఆరోగ్యం, దీర్ఘాయువు ప్రసాదించే గణనాథుడిని ఇంటి సంప్రదాయాల ప్రకారం ఒక రోజు, మూడు, ఐదు, ఏడు, పది రోజుల పాటు పూజించి నిమజ్జనం చేస్తారు.
తల్లి గౌరీ అనుగ్రహం లేనిదే కొడుకు గణపతి పూజ సంపూర్ణం కాదని పండితులు చెబుతున్నారు.












