మట్టి గణపతితో పర్యావరణానికి మేలు

గూడూరులో జనసేన ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమల పంపిణీ

గూడూరు, ప్రజా వీక్షణం: వినాయక చవితి వేడుకలను పర్యావరణహితంగా నిర్వహించేందుకు ప్రజలు మట్టి వినాయక ప్రతిమలను వినియోగించాలని జనసేన పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి తీగల చంద్రశేఖర్ రావు సూచించారు. ప్రకృతికి హాని కలగకుండా పండుగలను జరుపుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.గూడూరు పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివారం మట్టి వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణపై చిన్నతనం నుంచే పిల్లలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. పర్యావరణాన్ని కాపాడే అలవాట్లు విద్యార్థి దశ నుంచే పెంపొందించాలని తల్లిదండ్రులకు సూచించారు.పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిచ్చే ఉద్దేశంతో జనసేన పార్టీ ఆధ్వర్యంలో గత పదేళ్లుగా మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. పర్యావరణానికి హాని కలిగించే పదార్థాలతో తయారు చేసిన విగ్రహాలకు బదులుగా మట్టి ప్రతిమలను పూజించడం ద్వారా ప్రకృతి పరిరక్షణలో ప్రజలు భాగస్వాములు కావచ్చన్నారు.
వినాయక చవితి వంటి పండుగలను సంప్రదాయబద్ధంగా, అదే సమయంలో పర్యావరణానికి అనుకూలంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. కులమతాలకు అతీతంగా ప్రజలందరూ ఆనందోత్సాహాలతో వినాయక చవితి వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు.జనసేన పార్టీ గూడూరు నియోజకవర్గ నాయకులు కె. మోహన్ మాట్లాడుతూ.. గూడూరు పట్టణ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల్లో పర్యావరణ స్పృహ పెంచేందుకు ప్రతి ఏడాది మట్టి గణపతి ప్రతిమలను పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ఈసారి కూడా ప్రజలు మట్టి వినాయక ప్రతిమలను ఉపయోగించి పర్యావరణహితంగా పండుగను జరుపుకోవాలని కోరారు.
కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు విజయ్, సాయికిరణ్, అనిల్, శశికుమార్, లతీఫ్ తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Prajaveek Shanam