వాకాడు, సెప్టెంబర్ 14: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని వాకాడు తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఆధ్వర్యంలో వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గణనాథుడికి తహసీల్దార్ సయ్యద్ ఇక్బాల్, మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ బి. అఖిల్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా తహసీల్దార్ సయ్యద్ ఇక్బాల్ మాట్లాడుతూ.. వినాయక చవితి ప్రజలందరికీ ఎంతో విశిష్టమైన పండుగ అని పేర్కొన్నారు. విఘ్నాలను తొలగించే గణనాథుడిని భక్తిశ్రద్ధలతో కొలవడం మన సంప్రదాయంలో భాగమన్నారు. వినాయకుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. పండుగలను ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు.
మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ బి. అఖిల్ కుమార్ మాట్లాడుతూ.. వినాయక చవితి ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందాన్ని నింపాలని ఆకాంక్షించారు. గణనాథుడి కృపతో మండల ప్రజలకు అన్ని విధాలా మేలు జరగాలని కోరుకున్నారు. పండుగలు ఆధ్యాత్మికతతో పాటు సోదరభావం, ఐక్యతను పెంపొందించేందుకు దోహదపడతాయని తెలిపారు.అధికారులు, సిబ్బంది సమన్వయంతో కార్యాలయంలో వినాయక చవితి వేడుకలను నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వీఆర్వోలు, వీఆర్‌ఏలు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.












