స్థానిక ఎన్నికలకు టీడీపీ శ్రేణులు సిద్ధం కావాలి

కుప్పం, సెప్టెంబర్ 15, ప్రజా వీక్షణం:

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే సమన్వయంతో పనిచేయాలని ఏపీఎస్‌ఆర్టీసీ ఉపాధ్యక్షుడు పి.ఎస్. మునిరత్నం పిలుపునిచ్చారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కుప్పం మండలంలోని ఎన్.కొత్తపల్లి గ్రామ పంచాయతీలో శ్రీ కదిరి నరసింహస్వామి ఆలయం వద్ద టీడీపీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పి.ఎస్. మునిరత్నం ముఖ్య అతిథిగా హాజరై పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఎన్నికల సన్నద్ధతపై చర్చించారు.ఎన్.కొత్తపల్లి టీడీపీకి బలమైన ప్రాంతంగా కొనసాగుతోందని పేర్కొన్న మునిరత్నం.. పార్టీ శ్రేణులు పరస్పర సమన్వయంతో పనిచేసి స్థానిక స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. గ్రామాల్లో ప్రజలతో నిరంతరం మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు.అనంతరం కుంజేగనూరు గ్రామ పంచాయతీలోనూ టీడీపీ సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని మునిరత్నం పార్టీ శ్రేణులకు సూచించారు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి ప్రతి కార్యకర్త సమష్టి కృషి చేయాలని, గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

error: Content is protected !!
Prajaveek Shanam