– భక్తిశ్రద్ధలతో గణనాథుడి శోభాయాత్ర
చిట్టమూరు, సెప్టెంబర్ 15, ప్రజా వీక్షణం:
తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం కోగిలి గ్రామంలో గణేష్ ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన యువత ఐక్యంగా ముందుకు వచ్చి ఉత్సవాలను నిర్వహించడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.వినాయక మండపం వద్ద ప్రత్యేక పూజలు, భక్తి కార్యక్రమాలతో పాటు యువత ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా ఉట్టి కొట్టే కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. యువకులు ఉత్సాహంగా పాల్గొని ఉట్టి కొట్టడంతో చిన్నారులు, మహిళలు, గ్రామస్తులు సందడి చేశారు.
ఐక్యత చాటిన యువతకోగిలి గ్రామ యువత అంతా కలిసి ఉత్సవాల ఏర్పాట్లలో భాగస్వాములు కావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పరస్పరం సహకరించుకుంటూ మండపం ఏర్పాట్లు, పూజా కార్యక్రమాలు, శోభాయాత్ర, నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశారు.
భక్తిశ్రద్ధలతో శోభాయాత్ర
ఉత్సవాల ముగింపు సందర్భంగా గణనాథుడి విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి శోభాయాత్ర నిర్వహించారు. యువత, భక్తులు గణపతి నామస్మరణ చేస్తూ ఉత్సాహంగా శోభాయాత్రలో పాల్గొన్నారు. దీంతో గ్రామంలో సందడి నెలకొంది.సముద్రంలో గణనాథుడి నిమజ్జనంశోభాయాత్రగా సముద్రతీరానికి చేరుకున్న అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి గణనాథుడిని సంప్రదాయబద్ధంగా సముద్రంలో నిమజ్జనం చేశారు. అనంతరం యువత, గ్రామస్తులు సముద్ర స్నానం చేసి ఆనందంగా గ్రామానికి తిరిగి వచ్చారు.గణేష్ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన గ్రామస్తులు, యువతకు కోగిలి యువత కృతజ్ఞతలు తెలిపారు. భక్తి, ఐక్యత, సోదరభావాన్ని చాటేలా ఉత్సవాలు ప్రశాంతంగా ముగిశాయని గ్రామస్తులు పేర్కొన్నారు.












