గురుకులం కోసం గూడూరు బంద్‌కు పిలుపు

17న నియోజకవర్గ వ్యాప్తంగా నిరసనకు సాధన సమితి సిద్ధం

గూడూరు  సెప్టెంబర్ 15, ప్రజా వీక్షణం:
కోటలోని ఎస్సీ అంబేడ్కర్‌ గురుకుల పాఠశాలను కొనసాగించాలనే డిమాండ్‌తో ఉద్యమం మరింత ఉధృతమవుతోంది. పాఠశాలను మూసివేసి విద్యార్థులను ఇతర ప్రాంతాల్లోని గురుకులాలకు తరలించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 17న గూడూరు నియోజకవర్గ బంద్‌కు కోట అంబేడ్కర్‌ గురుకుల పాఠశాల సాధన సమితి పిలుపునిచ్చింది.దశాబ్దాలుగా కోటలో కొనసాగుతున్న ఈ గురుకుల పాఠశాల ఎంతోమంది విద్యార్థులకు విద్యను అందించిందని సమితి ప్రతినిధులు తెలిపారు. ప్రస్తుతం పాఠశాల మూసివేత నిర్ణయంతో విద్యార్థుల చదువుకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు.ఇతర గురుకుల పాఠశాలలకు విద్యార్థులను తరలించడంతో అక్కడ ఇప్పటికే ఉన్న వసతులపై అదనపు భారం పడుతోందని తెలిపారు. తరగతి గదులు, వసతి తదితర సౌకర్యాలు సరిపోక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
కొంతమంది విద్యార్థులు బదిలీ ధ్రువపత్రాలు తీసుకుని ఇళ్లకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని సమితి ప్రతినిధులు ఆరోపించారు. విద్యార్థుల విద్యాభ్యాసానికి సంబంధించి నెలకొన్న సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలని కోరారు.

కోటలోనే పాఠశాల కొనసాగించాలని డిమాండ్‌

అంబేడ్కర్‌ గురుకుల పాఠశాలను కోటలోనే కొనసాగించాలని సాధన సమితి డిమాండ్‌ చేసింది. ప్రతిపాదిత అత్యుత్తమ విద్యా కేంద్రాన్ని అవసరమైన మరో ప్రాంతంలో ఏర్పాటు చేయాలని కోరింది. ఈ అంశంపై విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపింది.ఈ నేపథ్యంలో 17న గూడూరు నియోజకవర్గ బంద్‌ను విజయవంతం చేయాలని సమితి కోరింది. వ్యాపారులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజలు బంద్‌కు సహకరించి విద్యార్థుల భవిష్యత్తు కోసం చేపడుతున్న ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.

error: Content is protected !!
Prajaveek Shanam