సూళ్లూరుపేట, నాయుడుపేటలో వార్డు ఆశావహులతో కీలక చర్చలు
నాయుడుపేట, సెప్టెంబర్ 15, ప్రజా వీక్షణం:
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే దిశగా నియోజకవర్గంలో కార్యకలాపాలు ముమ్మరమయ్యాయి. ఇందులో భాగంగా సూళ్లూరుపేట, నాయుడుపేట పట్టణాల్లో మున్సిపల్ వార్డులకు పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న ఆశావహులతో పార్టీ నాయకులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు.మంగళవారం నిర్వహించిన ఈ సమావేశాల్లో వార్డు స్థాయిలో పార్టీ పరిస్థితి, స్థానిక సమస్యలు, ప్రజల అభిప్రాయాలు, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు తదితర అంశాలపై ఆశావహులతో చర్చించారు. పోటీ చేయాలనుకుంటున్న ప్రతి అభ్యర్థి స్థానికంగా పార్టీ బలోపేతానికి ఎలా పనిచేయగలరనే అంశంపైనా అభిప్రాయాలు తెలుసుకున్నారు.తిరుపతి, చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గాల కన్వీనర్, ఉంగుటూరు శాసనసభ్యుడు పత్సమట్ల ధర్మరాజు ఆదేశాల మేరకు తిరుపతి పార్లమెంట్ సమన్వయ బృందం సభ్యుడు బి. విజయ్‌కుమార్ ఆశావహులతో సమావేశమై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.
రెండు పట్టణాల్లో సమావేశాలు
సూళ్లూరుపేట పట్టణంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో మధ్యాహ్నం సమావేశం నిర్వహించారు. అనంతరం నాయుడుపేటలోని సూళ్లూరుపేట నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో సాయంత్రం సమావేశం జరిగింది.నాయుడుపేటలో పార్టీ కార్యాలయానికి వచ్చిన బి. విజయ్‌కుమార్‌ను జనసేన సీనియర్ నాయకుడు అట్ల కృష్ణారావు మర్యాదపూర్వకంగా ఆహ్వానించి శాలువాతో సత్కరించారు.
వార్డు స్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి
సూళ్లూరుపేట, నాయుడుపేట మున్సిపాలిటీల పరిధిలో పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడంతో పాటు నాయకులు, కార్యకర్తలు, ఆశావహుల మధ్య సమన్వయం పెంచుకోవాలని సమావేశంలో చర్చించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచే వార్డు స్థాయిలో పటిష్టమైన కార్యాచరణ రూపొందించుకోవాలని నిర్ణయించినట్లు నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమాలను సూళ్లూరుపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్, నాయుడుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సమన్వయ కమిటీ సహాయక బృందం సభ్యుడు మాబాషా ఆధ్వర్యంలో నిర్వహించారు. వార్డు ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు, జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.












