చిల్లకూరులో మండల స్థాయి సమావేశం.. ఓటర్ల జాబితా, ప్రజా సమస్యలపై చర్చ

చిల్లకూరు: సెప్టెంబర్ 16 ప్రజా వీక్షణం
స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తెలుగుదేశం పార్టీ శ్రేణులు గ్రామస్థాయిలో మరింత సమన్వయంతో పనిచేయాలని చిల్లకూరు మండల పార్టీ అధ్యక్షుడు దువ్వూరు రాజశేఖర్‌రెడ్డి సూచించారు. చిల్లకూరు మండల కేంద్రంలోని జ్యోతి వే బ్రిడ్జి సమీపంలోని టీడీపీ కార్యాలయంలో బుధవారం ఆయన ఆధ్వర్యంలో మండల స్థాయి సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి 6, 7 క్లస్టర్ల కన్వీనర్లు, కో-కన్వీనర్లు, 9 యూనిట్ల ఇన్‌చార్జ్‌లు, దేవస్థానాల చైర్మన్లు, సాగునీటి సంఘాల అధ్యక్షులు, రాష్ట్ర, పార్లమెంట్, నియోజకవర్గ, మండల కమిటీల నాయకులు హాజరయ్యారు.ఈ సందర్భంగా దువ్వూరు రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. మొదటి బుధవారం నిర్వహించిన యూనిట్ సమావేశాల్లో చేసిన తీర్మానాలపై మండల స్థాయిలో సమీక్షించినట్లు తెలిపారు. ఆయా ప్రాంతాల్లోని ఓటర్ల జాబితాలను పరిశీలించి, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించినట్లు చెప్పారు.
అదేవిధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, వాటిపై విస్తృతంగా ప్రచారం నిర్వహించడం, గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటిని నమోదు చేయడంపై సమావేశంలో చర్చించినట్లు తెలిపారు.గ్రామాల వారీగా గుర్తించిన ప్రజా సమస్యలు, ఓటర్ల జాబితాకు సంబంధించిన అంశాలు, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన విషయాలను మూడవ బుధవారం జరిగే నియోజకవర్గ స్థాయి సమావేశంలో ప్రస్తావించి, వాటిపై తదుపరి కార్యాచరణ రూపొందించనున్నట్లు రాజశేఖర్‌రెడ్డి తెలిపారు.పార్టీకి చెందిన క్లస్టర్, యూనిట్ స్థాయి నాయకులు క్షేత్రస్థాయిలో ప్రజలతో నిరంతరం మమేకమై వారి సమస్యలను తెలుసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ కార్యదర్శి నెల్లటూరు చిరంజీవి, పెనుబోలు జానకిరామిరెడ్డి, లైవ్‌స్టాక్ డైరెక్టర్ గుండాల లీలావతి, ఏడో క్లస్టర్ ఇన్చార్జ్ పూడి పత్తి ప్రవీణ్‌రెడ్డి, కమ్మవారిపాలెం మాజీ సర్పంచ్ చిట్టేటి నారాయణ, దేవస్థానం చైర్మన్ కోట సతీష్‌యాదవ్, గూడూరు నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు రావుల వెంకటేశ్వర్లు గౌడ్, మూగ శంకరయ్య, దువ్వూరు వినయ్‌కుమార్‌రెడ్డి, సతీష్‌రెడ్డి, పచ్చ వెంకటేశ్వర్లు నాయుడు, కీరవాణి తదితరులు పాల్గొన్నారు.












