ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలి

గ్రామస్తులకు ఎస్సై నాగరాజు అవగాహన
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక

చిట్టమూరు, సెప్టెంబర్ 24:
రానున్న ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా జరిగేలా ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని చిట్టమూరు ఎస్సై నాగరాజు సూచించారు. కోగిలి పంచాయతీ గ్రామస్తులకు గురువారం ఎన్నికలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ప్రజలు సంయమనం పాటిస్తూ పరస్పర స్నేహభావంతో మెలగాలని కోరారు. రాజకీయ అభిప్రాయాలు వేరుగా ఉన్నప్పటికీ వ్యక్తిగత విభేదాలకు తావివ్వకుండా అందరూ సోదరభావంతో ఉండాలని సూచించారు. గ్రామాల్లో గొడవలు, వివాదాలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ఎన్నికల నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.ఎన్నికల సమయంలో వాగ్వాదాలు, ఘర్షణలకు దారితీసే చర్యలకు పాల్పడితే చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామ పెద్దలు, యువత, ప్రజాప్రతినిధులు బాధ్యతగా వ్యవహరించి ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు.

మైనర్లు వాహనాలు నడపకుండా చూడాలి

రహదారి భద్రతపై కూడా ఎస్సై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని తెలిపారు.

ఎన్నికల సమయంలో అనుమానాస్పద ఘటనలు లేదా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే పరిస్థితులు కనిపిస్తే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని ఎస్సై నాగరాజు కోరారు. ప్రజల సహకారంతోనే ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించగలమని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.

error: Content is protected !!
Prajaveek Shanam