ప్రజా వీక్షణం సెప్టెంబర్ 30:
జిల్లాలో నేరాల నియంత్రణ, మాదకద్రవ్యాల నిర్మూలన, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా ‘ఆపరేషన్ త్రిశూల్’కు శ్రీకారం చుట్టారు. కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్‌తో కలిసి తొలి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో శాంతిభద్రతలను మరింత బలోపేతం చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. మాదకద్రవ్యాల సరఫరా, వినియోగాన్ని అరికట్టేందుకు డ్రగ్స్ హాట్స్పాట్లను గుర్తించి కఠిన చర్యలు చేపట్టాలని సూచించారు. పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ శక్తి బృందాల కార్యకలాపాలను విస్తృతం చేయాలని, ప్రజా ప్రదేశాలు, విద్యాసంస్థలు, రవాణా కేంద్రాల వద్ద పర్యవేక్షణ పెంచాలని సూచించారు.రోడ్డు ప్రమాదాల నివారణకు అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడంపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. జిల్లాలో గుర్తించిన ప్రమాదకర ప్రాంతాల్లో నెల రోజుల్లో భద్రతా చర్యలు పూర్తి చేయాలని సూచించారు. అమరావతి రాజధాని ప్రాంతంలో వాహనాల వేగ నియంత్రణకు ప్రత్యేక పరికరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.ప్రజలు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు భద్రతా చర్యల్లో భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమణమూర్తి, జిల్లా రెవెన్యూ అధికారి ఖాజావలి, ఆర్టీవో శ్రీహరి రావు తదితరులు పాల్గొన్నారు.












