వృద్ధులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత

– వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు

అక్టోబర్ 1 (ప్రజా వీక్షణం):

వృద్ధులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ బెన్షాలోమ్‌తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ వృద్ధుల పట్ల గౌరవం, ఆప్యాయత, బాధ్యత పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. వైద్య, ఆరోగ్య రంగాల్లో వచ్చిన అభివృద్ధితో ప్రజల ఆయుష్షు పెరుగుతోందని, వృద్ధాప్య దశలో వారి ఆరోగ్యం, ఆర్థిక భద్రత, సామాజిక గౌరవానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. తల్లిదండ్రులు జీవితాంతం పిల్లల కోసం కష్టపడతారని, వృద్ధాప్యంలో వారికి అండగా నిలవడం పిల్లల బాధ్యత అని పేర్కొన్నారు.
వృద్ధుల హక్కుల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లిదండ్రులు, వృద్ధ పౌరుల పోషణ మరియు సంక్షేమ చట్టం–2007 ద్వారా చట్టపరమైన రక్షణ కల్పిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే సందర్భాల్లో చట్టపరమైన మార్గాల ద్వారా నిర్వహణ భృతి పొందే అవకాశం ఉందన్నారు. అలాగే ఆస్తులు బదలాయించిన తర్వాత సంరక్షణ లేకపోతే చట్టంలోని నిబంధనల ప్రకారం ఆ బదలాయింపులను రద్దు చేసుకునే అవకాశం కూడా ఉందని వివరించారు. ప్రభుత్వం అర్హులైన వృద్ధులకు వృద్ధాప్య పింఛన్లు అందిస్తూ ఆర్థిక భరోసా కల్పిస్తోందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రణామ్ కేంద్రాలు వృద్ధులకు ఉపయోగకరంగా మారాయని తెలిపారు. అక్కడ వృద్ధులు పరస్పరం కలుసుకోవడం, విశ్రాంతి తీసుకోవడం, పుస్తకాలు చదవడం వంటి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. వృద్ధులకు అవసరమైన సహాయం కోసం 14567 టోల్ ఫ్రీ సేవలను వినియోగించుకోవాలని సూచించారు.అదనపు కలెక్టర్ బెన్షాలోమ్ మాట్లాడుతూ వృద్ధుల సంక్షేమం సమాజ బాధ్యత అని అన్నారు. రాబోయే సంవత్సరాల్లో వృద్ధుల జనాభా మరింత పెరిగే అవకాశం ఉన్నందున వారి ఆరోగ్యం, ఆర్థిక భద్రత, సామాజిక రక్షణపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. వివిధ సంక్షేమ పథకాలు, డే కేర్ కేంద్రాల ద్వారా వృద్ధులకు అవసరమైన సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. వృద్ధులు కుటుంబాలకు, సమాజానికి అందించిన సేవలు, అనుభవం, జ్ఞానం అమూల్యమని కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు పేర్కొన్నారు. వారిని కుటుంబానికి మార్గదర్శకులుగా గుర్తించి గౌరవించాలని సూచించారు. అనంతరం వృద్ధులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, సిబ్బంది, వివిధ మండలాలకు చెందిన వృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

error: Content is protected !!
Prajaveek Shanam