అక్టోబరు 1 (ప్రజా వీక్షణం):
అక్కినేని నాగార్జున, దర్శకుడు మణిరత్నం కలయికలో వచ్చిన కల్ట్ క్లాసిక్ ప్రేమకథ ‘గీతాంజలి’ మరోసారి వెండితెరపై సందడి చేయనుంది. 1989లో విడుదలై తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఈ చిత్రాన్ని నవంబరు 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రీ-రిలీజ్ చేయనున్నట్లు అన్నపూర్ణ స్టూడియోస్ వెల్లడించింది.
4కే నాణ్యతలో..
దాదాపు 37 ఏళ్ల క్రితం విడుదలైన ‘గీతాంజలి’ని 4కే డిజిటల్ నాణ్యతతో పాటు రీ-మాస్టర్డ్ ఆడియోతో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. గతంలో కొన్ని సాంకేతిక కారణాల వల్ల రీ-రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా నవంబరు 13న విడుదల తేదీ ఖరారు కావడంతో అక్కినేని అభిమానులు, సినీ ప్రేమికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సినిమాలో నాగార్జున తన నటనతో అప్పట్లోనే ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచారు. కథానాయిక గిరిజ షెట్టర్ తన అల్లరి, అమాయకత్వంతో ‘గీతాంజలి’ పాత్రకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు. ప్రేమ, భావోద్వేగాలతో కూడిన కథ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఇళయరాజా సంగీతానికి మరోసారి విందు
‘గీతాంజలి’కి ఇళయరాజా అందించిన సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇప్పటికీ ప్రేక్షకుల్ని అలరించే పాటలను 4కే వెర్షన్లో మెరుగైన ధ్వని నాణ్యతతో థియేటర్లలో వినే అవకాశం లభించనుంది. దీంతో ఈ సినిమా రీ-రిలీజ్‌పై సంగీత ప్రియుల్లోనూ ఆసక్తి నెలకొంది.
పాతతరం ప్రేక్షకులకు ‘గీతాంజలి’ తీపి జ్ఞాపకాలను గుర్తుచేయనుండగా.. నేటి తరం ప్రేక్షకులకు ఓ క్లాసిక్ ప్రేమకథను పెద్ద తెరపై చూసే అవకాశం కలగనుంది. నవంబరు 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం ఎలాంటి స్పందన అందుకుంటుందో చూడాలి.












