
ప్రజా వీక్షణం అక్టోబర్ 03
గూడూరు సబ్ డివిజన్ నూతన డీఎస్పీగా శ్రీకాళహస్తి నుంచి బదిలీపై వచ్చిన నరసింహమూర్తి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు అందించారు. పలువురు సీఐలు, ఎస్సైలు డీఎస్పీని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం మీడియాతో డీఎస్పీ నరసింహమూర్తి మాట్లాడుతూ గూడూరు పట్టణంలో ట్రాఫిక్ సమస్యను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జాతీయ రహదారిపై తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి భద్రతా చర్యలను పటిష్టం చేస్తామన్నారు. దొంగతనాల నివారణకు పోలీసు గస్తీని ముమ్మరం చేస్తామని, సీసీ కెమెరాలను పరిశీలించి మరమ్మతులకు గురైన వాటిని పునరుద్ధరిస్తామని చెప్పారు.
రాబోయే ఆంజనేయస్వామి జెండా ఉత్సవాన్ని ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలని కోరారు. ఉత్సవాల్లో ఎవరైనా అల్లర్లకు పాల్పడినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని డీఎస్పీ కోరారు.












