గూడూరులో ట్రాఫిక్ సమస్య పరిష్కరించాలినూతన డీఎస్పీ నరసింహమూర్తికి వినతిపత్రం

గూడూరు: గూడూరు పట్టణంలో రోజురోజుకూ తీవ్రంగా మారుతున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడంతో పాటు ప్రధాన రహదారుల మార్జిన్లలో ఉన్న ఆక్రమణలను తొలగించాలని కోరుతూ బహుజన సమాజ్ పార్టీ, ఏపీ ప్రజా కుల సంఘాల ఐక్యవేదిక, జాతీయ బీసీ చైతన్య సమితి, గూడూరు ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రతినిధులు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డీఎస్పీ నరసింహమూర్తికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.

చిల్లకూరు జాతీయ రహదారి నుంచి గూడూరు రైల్వేస్టేషన్, సాధుపేట సెంటర్, ధూర్జటి నగర్, నారాయణ ఇంజినీరింగ్ కళాశాల వరకు ప్రధాన రహదారిపై ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉందని ప్రతినిధులు డీఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. రహదారికి ఇరువైపులా కొందరు వ్యాపారులు వస్తువులు, ప్రదర్శన బోర్డులను రోడ్డు మార్జిన్ దాటి ప్రధాన రహదారిపైకి ఏర్పాటు చేయడం వల్ల వాహనాల రాకపోకలకు, పాదచారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వినతిపత్రంలో పేర్కొన్నారు.

ఆక్రమణల కారణంగా నిత్యం ట్రాఫిక్ స్తంభిస్తోందని, అత్యవసర సమయాల్లో అంబులెన్సులకు సైతం దారి దొరకని పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు. దీనివల్ల అత్యవసర వైద్యసేవల కోసం తరలించే రోగులకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ట్రాఫిక్ విభాగం ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి ఆక్రమణలను తొలగించాలని కోరారు. రహదారులపై వాహనాల రాకపోకలు సజావుగా సాగడంతో పాటు పాదచారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కఠిన నిబంధనలు అమలు చేసి ప్రజల భద్రతకు చర్యలు చేపట్టాలని డీఎస్పీని కోరారు.

ఈ కార్యక్రమంలో ఎల్.వి. సుబ్బయ్య, నాసిన భాస్కర్ గౌడ్, జి. వెంకటేశ్వరరాజు, ఎం.కె. మురళి, ఏకసిరి రవి, మీదూరు సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Prajaveek Shanam