బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి

స్థానిక సంస్థల ఎన్నికలు రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే నిర్వహించాలి

బీఎస్పీ నాయకుల డిమాండ్

గూడూరు, అక్టోబర్ 5:
కూటమి ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని బహుజన సమాజ్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు.నెల్లూరు జిల్లా గూడూరు కార్‌స్టాండ్ వద్ద ఉన్న శ్రీ మహాత్మ జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాల వద్ద సోమవారం ఉదయం 11 గంటలకు బీఎస్పీ ఆధ్వర్యంలో పలు కుల సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. అనంతరం దినపత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఎల్వీ సుబ్బయ్య, నాశిన భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ.. బీసీలకు రిజర్వేషన్ల అమలులో అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. “ఓట్లు మావి.. సీట్లు మీకా?” అంటూ పాలకులను ప్రశ్నించారు. అధికారంలోకి రాకముందు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత మరో మాట మాట్లాడటం సరికాదన్నారు.బీసీల ఓట్లతో అధికారంలోకి వస్తున్న పాలకులు దశాబ్దాలుగా బీసీల సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారని వారు విమర్శించారు. బీసీలపై దాడులు జరుగుతున్నా వాటిని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. బీసీల రక్షణ చట్టం అమలు చేయాలని, కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు.బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల కోసం అనేక ధర్నాలు, నిరాహార దీక్షలు నిర్వహించడంతో పాటు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి తమ డిమాండ్లను వివరించామని నాయకులు తెలిపారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 34 శాతం బీసీ రిజర్వేషన్లు ప్రకటించిందని, ఆ రిజర్వేషన్లపై న్యాయస్థానాల్లో సమస్యలు తలెత్తాయని పేర్కొన్నారు.బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని అమలు చేయాలని వారు కోరారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వాలు ఉన్నందున కేంద్రంతో చర్చించి బీసీల రిజర్వేషన్లకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లను రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చి అమలు చేసిన విధంగా, ఆంధ్రప్రదేశ్‌లోనూ బీసీలకు 50 శాతం రిజర్వేషన్లను రాజ్యాంగపరమైన రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని నాయకులు కోరారు.స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలోపు బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని, లేకపోతే ఎన్నికల్లో తమ బలాన్ని చూపిస్తామని బీఎస్పీ నాయకులు తెలిపారు. “దేశానికి స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడిచినా బీసీలకు సామాజిక, రాజకీయ స్వాతంత్ర్యం పూర్తిగా రాలేదు” అని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో తిరగాబతిన శేషయ్య గౌడ్, జి. వెంకటేశ్వరరాజు, గెరిటి నారాయణ, సీనయ్య, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Prajaveek Shanam