సేవా సేతు అభియాన్ పోస్టర్ విడుదల

  • ప్రతి ఇంటికి సౌర విద్యుత్ లక్ష్యంగా ప్రత్యేక శిబిరాలు
  • పీఎం సూర్య ఘర్ పథకంపై విస్తృత అవగాహన
  • అర్హులంతా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి
  • జిల్లా కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ

అక్టోబర్ 5 (ప్రజా వీక్షణం ప్రతినిధి):

పీఎం సూర్య ఘర్–ముఫ్త్ బిజ్లీ యోజన పథకాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో నిర్వహించనున్న “సేవా సేతు అభియాన్” కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ సోమవారం కలెక్టర్ కార్యాలయంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి సౌర విద్యుత్‌ను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు పునరుత్పాదక ఇంధన వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంపొందించడమే ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సౌర విద్యుత్ వినియోగం ద్వారా విద్యుత్ ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడవచ్చన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్య ఘర్ పథకం ద్వారా గృహ వినియోగదారులు రూఫ్‌టాప్ సౌర విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకునేందుకు సబ్సిడీ అందిస్తున్నట్లు వివరించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
“సేవా సేతు అభియాన్” శిబిరాల్లో పథకానికి సంబంధించిన అర్హతలు, దరఖాస్తు విధానం, సబ్సిడీ ప్రయోజనాలు, రూఫ్‌టాప్ సౌర విద్యుత్ వ్యవస్థల ఏర్పాటు, నెట్ మీటరింగ్ విధానం వంటి అంశాలపై సమగ్ర అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ప్రజలకు ఎదురయ్యే సందేహాలను అక్కడికక్కడే నివృత్తి చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఈ శిబిరాల్లో బ్యాంకర్లు, సౌర విద్యుత్ విక్రేతలు, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొని పథకానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందించనున్నట్లు తెలిపారు. రుణ సదుపాయాలు, సాంకేతిక అంశాలు, విద్యుత్ అనుసంధానం వంటి విషయాలపై కూడా ప్రజలకు మార్గనిర్దేశం చేయనున్నట్లు పేర్కొన్నారు.
సౌర విద్యుత్ వినియోగం పెరగడం వల్ల గృహ వినియోగదారులకు ఆర్థిక ప్రయోజనాలు కలగడమే కాకుండా సంప్రదాయ ఇంధన వనరులపై ఆధారపడటం తగ్గుతుందని కలెక్టర్ వివరించారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, పర్యావరణహితమైన ఇంధన వనరులను అందించడంలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజినీర్లు సి.హెచ్. రమేష్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. అర్హులైన ప్రతి గృహ వినియోగదారుడు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని సౌర విద్యుత్ ప్రయోజనాలను పొందాలని అధికారులు పిలుపునిచ్చారు.

error: Content is protected !!
Prajaveek Shanam