గూడూరు: (ప్రజా వీక్షణం) అక్టోబర్ 08
గూడూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ప్రముఖ సినీ దర్శకుడు, నిర్మాత, రచయిత, పాఠశాల పూర్వ విద్యార్థి సంగీతం శ్రీనివాసరావు మృతికి గురువారం ఘనంగా నివాళులర్పించారు. పాఠశాల పూర్వ విద్యార్థి, ప్రముఖ ఆడిటర్ శ్రీకంటి రామ్మోహనరావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సంగీతం శ్రీనివాసరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీకంటి రామ్మోహనరావు మాట్లాడుతూ.. తెలుగు సినీ రంగానికి ప్రత్యేకమైన శైలిని పరిచయం చేసిన సృజనశీలి సంగీతం శ్రీనివాసరావు తమ పాఠశాలలో విద్యనభ్యసించడం గర్వకారణమన్నారు. ఆయన తెరకెక్కించిన చిత్రాలు మాత్రమే కాకుండా, ఆయన ఆలోచనా విధానం కూడా తెలుగు సినీ రంగంపై చెరగని ముద్ర వేశాయని పేర్కొన్నారు.విద్యార్థులు సంగీతం శ్రీనివాసరావు వంటి మహనీయులను ఆదర్శంగా తీసుకుని కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో చిల్లకూరు విద్యాశాఖ అధికారి మహమ్మద్ రవూఫ్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భారతి, బండి ధనుంజయరెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి, కోదండరాం, ప్రసాద్‌రావు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.












