ఎంజీ హెక్టార్‌లో కొత్త స్టార్మ్‌ ఎడిషన్లు

న్యూఢిల్లీ, అక్టోబరు 8 (ప్రజా వీక్షణంప్రతినిధి): ఎంజీ మోటార్‌ ఇండియా హెక్టార్‌ ఎస్‌యూవీలో రెండు కొత్త ప్రత్యేక ఎడిషన్లను విడుదల చేసింది. ‘బ్లాక్‌స్టార్మ్‌’, ‘స్నోస్టార్మ్‌’ పేర్లతో తీసుకొచ్చిన ఈ రెండు మోడళ్ల ఎక్స్‌-షోరూమ్‌ ధరను రూ.20 లక్షలుగా నిర్ణయించింది. సావీ ప్రో సీవీటీ వేరియంట్‌తో పోలిస్తే ఇవి రూ.35,000 అధిక ధరకు లభిస్తున్నాయి. రెండు ఎడిషన్లూ 5 సీటర్‌ వేరియంట్‌లో, 1.5 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌, సీవీటీ గేర్‌బాక్స్‌తో వస్తాయి.
బ్లాక్‌స్టార్మ్‌, స్నోస్టార్మ్‌ ప్రత్యేకతలు
బ్లాక్‌స్టార్మ్‌ పూర్తిగా నలుపు రంగు థీమ్‌తో రూపొందించారు. డార్క్‌ క్రోమ్‌ బ్యాడ్జింగ్‌, పియానో బ్లాక్‌ రూఫ్‌ రైల్స్‌, స్మోక్డ్‌ టెయిల్‌ ల్యాంప్స్‌ ఇందులో ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. స్నోస్టార్మ్‌ పెర్ల్‌ వైట్‌ బాడీ, స్టార్‌ బ్లాక్‌ రూఫ్‌తో వస్తుంది.
రెండు మోడళ్లలోనూ స్టార్మ్‌ హెక్స్‌ గ్రిల్‌, బ్లాక్‌ హెడ్‌ల్యాంప్‌ బెజెల్స్‌, బ్లాక్‌ అల్లాయ్‌ వీల్స్‌, రెడ్‌ బ్రేక్‌ కాలిపర్స్‌ అందించారు. లోపల డార్క్‌ క్యాబిన్‌, బ్లాక్‌ లెదర్‌ సీట్లు, ముందు హెడ్‌రెస్టులపై ఎడిషన్‌ పేర్ల ఎంబాసింగ్‌ ఉన్నాయి.
70కి పైగా ఐ-స్మార్ట్‌ ఫీచర్లు
హెక్టార్‌ స్టార్మ్‌ ఎడిషన్లలో 8 రంగుల యాంబియంట్‌ లైటింగ్‌, పనోరమిక్‌ సన్‌రూఫ్‌, ఎయిర్‌ ప్యూరిఫయర్‌, పవర్డ్‌ టెయిల్‌గేట్‌ వంటి సౌకర్యాలు ఉన్నాయి. 35.56 సెం.మీ పోర్ట్రెయిట్‌ టచ్‌స్క్రీన్‌, 17.78 సెం.మీ డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌ను అందించారు. ఐ-స్మార్ట్‌ కనెక్టెడ్‌ టెక్నాలజీ ద్వారా 70కి పైగా ఫీచర్లు అందుబాటులో ఉంటాయి.
భద్రతకు ప్రాధాన్యం
భద్రత పరంగా 360 డిగ్రీల కెమెరా, ఫ్రంట్‌ పార్కింగ్‌ సెన్సర్లు, ఏబీఎస్‌, ఈబీడీ, ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ కంట్రోల్‌, ట్రాక్షన్‌ కంట్రోల్‌, హిల్‌ హోల్డ్‌, బ్రేక్‌ అసిస్ట్‌తో పాటు ఏడీఏఎస్‌ సౌకర్యాలను అందించారు. డీలర్‌ వద్ద స్టార్మ్‌ యాక్సెసరీ ప్యాకేజీ కూడా అందుబాటులో ఉంటుంది.
ఎంజీ హెక్టార్‌ స్టార్మ్‌ ఎడిషన్ల కొనుగోలుదారులకు 84 నెలల వరకు 100 శాతం ఆన్‌-రోడ్‌ ఫైనాన్స్‌ సదుపాయం కల్పిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. అలాగే మూడు సంవత్సరాల వారంటీ, రోడ్‌సైడ్‌ అసిస్టెన్స్‌, మూడు ఉచిత సర్వీసులతో కూడిన ఎంజీ షీల్డ్‌ ప్యాకేజీని అందిస్తోంది.

error: Content is protected !!
Prajaveek Shanam