న్యూఢిల్లీ, అక్టోబరు 8 ( ప్రతినిధి): యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ ద్వారా జరిగే ఎంపిక చేసిన వ్యాపార లావాదేవీలపై కొత్తగా ప్రతిపాదించిన మర్చంట్ డిస్కౌంట్ రేట్ ఛార్జీలు అక్టోబరు 15 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే పండుగ సీజన్ ముగిసే వరకు లేదా వచ్చే ఏడాది ప్రారంభం వరకు ఈ ఛార్జీల అమలును వాయిదా వేయాలని దేశవ్యాప్తంగా వ్యాపార సంఘాలు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను కోరాయి.
రూ.2,000 దాటితే ఛార్జీ
ఎన్‌పీసీఐ ప్రతిపాదించిన నిబంధనల ప్రకారం.. ఎంపిక చేసిన వ్యాపార కేటగిరీల్లో రూ.2,000కు మించిన యూపీఐ చెల్లింపులపై రూ.5 ఫ్లాట్ ఛార్జీ విధించనున్నారు. పెద్ద వ్యాపారులకు రూ.2,000 దాటిన లావాదేవీలపై 0.4 శాతం రుసుము వర్తిస్తుంది. దీనికి గరిష్ఠంగా రూ.300 పరిమితి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్, సెక్యూరిటీల వంటి మూలధన మార్కెట్ లావాదేవీలపై 0.02 శాతం ఎండీఆర్ వర్తించనుండగా.. దీనికి కూడా రూ.300 గరిష్ఠ పరిమితిగా నిర్ణయించారు.
4 శాతం లావాదేవీలకే వర్తింపు
ఈ మార్పుల వల్ల కేవలం 4 శాతం వ్యాపార లావాదేవీలపైనే ప్రభావం ఉంటుందని ఎన్‌పీసీఐ స్పష్టం చేసింది. 95 శాతానికి పైగా పర్సన్-టు-మర్చంట్ యూపీఐ చెల్లింపులకు ఈ ఛార్జీలు వర్తించవని పేర్కొంది. పీర్-టు-పీర్ విధానాన్ని ఉపయోగించే చిన్న వ్యాపారులకు ఎండీఆర్ ఛార్జీలు ఉండవని తెలిపింది. సాధారణ వినియోగదారులు యూపీఐ ద్వారా వ్యక్తిగత చెల్లింపులు చేసేటప్పుడు ఎలాంటి అదనపు భారం ఉండదని స్పష్టం చేసింది.
కస్టమర్లపై భారం మోపొద్దు
ఎండీఆర్ ద్వారా వచ్చే ఆదాయాన్ని యూపీఐ వ్యవస్థ విస్తరణ, సైబర్ భద్రత, సాంకేతిక ఆవిష్కరణలకు వినియోగించనున్నారు. మొత్తం ఎండీఆర్ వసూళ్లలో 5 శాతాన్ని చిన్న వ్యాపారుల్లో యూపీఐ వినియోగాన్ని ప్రోత్సహించే ప్రత్యేక నిధికి కేటాయించనున్నారు. మరోవైపు కొత్త ఛార్జీలను కస్టమర్ల నుంచి వసూలు చేయకుండా చూడాలని బ్యాంకులకు ఎన్‌పీసీఐ సూచించినట్లు సమాచారం. పండుగ సీజన్‌లో అమ్మకాలు కీలకంగా ఉండటంతో ఛార్జీల అమలును వాయిదా వేయాలని వ్యాపార సంఘాలు కోరుతున్నప్పటికీ.. వారి విజ్ఞప్తిపై ఎన్‌పీసీఐ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.












